KTR | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ప్రతిష్ఠకు ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావాలనే మహత్తర సంకల్పంతో ఫార్ములా-ఈ రేస్ నిర్వహించేందుకు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిన కృషిని, ఫలితంగా లభించిన ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసి, తనపై తప్పుడు కేసు బనాయించిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. విధానపరమైన నిర్ణయంలో భాగంగా ఫార్ములా-ఈ రేస్ నిర్వహిస్తే, అదేదో తన సొంత నిర్ణయమన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ ద్వారా కేసు నమోదు చేయించిందని మండిపడ్డారు. విధాన నిర్ణయాల్లో లోపాలుంటే అవి ప్రభుత్వం సరిదిద్దుకోవాలని, ఆ నిర్ణయాలను అమలు చేసేటప్పుడు లోటుపాట్లను సరిచేసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదని స్పష్టంచేశారు. తనకు ఒక పైసా కూడా ప్రభుత్వం చెల్లించనప్పుడు, ఎలాంటి లబ్ధిపొందనప్పుడు తాను అవినీతికి పాల్పడినట్టుగా కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. నిజంగానే అవినీతి జరిగిందని ప్రభుత్వం భావిస్తే నిర్వాహకులను ఎందుకు నిందితులుగా చేర్చలేదని నిలదీశారు.
ఒప్పందాలన్నీ ప్రభుత్వమే కుదుర్చుకున్నదని, వాటి పత్రాలన్నీ ప్రభుత్వం వద్దనే ఉన్నాయని, సొమ్ము తీసుకున్న నిర్వాహకులు, సొమ్ము చెల్లించిన ప్రభుత్వమూ గట్టు మీద ఉన్నారని, మంత్రి హోదాలో విధానపరమైన నిర్ణయంలో భాగమైనందున తనపై అవినీతిపరుడనే ముద్ర వేసి రాజకీయంగా, వ్యక్తిగతంగా అప్రతిష్ఠపాలు చేయాలనే ప్రభుత్వ కుట్రను అడ్డుకోవాలని కోర్టును కోరారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్లో ఏసీబీ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై కేటీఆర్ 14 పేజీల రిప్లయ్ కౌంటర్ దాఖలు చేశారు. ‘ఏసీబీ కేసుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా దర్యాప్తును అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం సరికాదు. ఎఫ్ఐఆర్లో ప్రాథమికంగా నేరారోపణలకు ఆధారాలు లేవు కాబట్టే.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాను. నేరాభియోగాలు వెల్లడికాలేదు. కాబట్టే క్వాష్ పిటిషన్ దాఖలు చేశా. రాజకీయ కక్షసాధింపు చర్యలతో దర్యాప్తు సంస్థలను వాడుకోవడం దారుణం. ఈ ప్రక్రియను కోర్టు ద్వారానే అడ్డుకునే హకు నాకు ఉన్నది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఫీజు 3 వాయిదాల్లో చెల్లింపునకు అంగీకారం
‘ఆర్థికపరమైన ప్రభావాలను అంచనా వేయకుండా, ఆలోచించకుండా ప్రభుత్వం స్పాన్సర్షిప్ పాత్రను భరించింది అనడం సరికాదు. 9 నుంచి 12వ సీజన్ వరకు 2023 మే 5లోగా స్పాన్సర్ చెల్లించాల్సిన 10వ సీజన్ ఫీజుపై ఎఫ్ఈవో రాసిన లేఖపై ప్రభుత్వం స్పందించలేదు. ప్రపంచవ్యాప్తంగా పోటీలను 2023 జూన్ 20 నుంచి నిర్వహించడానికి షెడ్యూలు ఖరారు చేయడంతో ఎఫ్ఈవోతో ప్రభుత్వం సంప్రదించింది. 10వ సీజన్ పోటీలను నిర్వహించడానికి అంగీకరించింది. ఫీజు మొత్తాన్ని 3 వాయిదాల్లో చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. మొదటి విడత 25% 2023 సెప్టెంబర్ 26న, మరో 25% అక్టోబర్ 4లోగా, మిగిలిన 50% అక్టోబర్ 31లోగా చెల్లించాలి. నాటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ హెచ్ఎండీఏ కమిషనర్ హోదాలో పురపాలకశాఖ మంత్రి ఆమోదం కోసం ఫైల్ నాకు పంపారు.
10వ సీజన్ నిర్వహణకు మొత్తం రూ.160 కోట్లు అనుమతించాలని ఫైల్లో ఉన్నది. మొదటి విడత చెల్లింపుల నిమిత్తం నేను ఆమోదం తెలిపాను’ అని కేటీఆర్ రిప్లయ్‌లో వివరించారు. ‘పన్నుకు సంబంధించిన అంశం పాత ఒప్పందంలోనే ఉన్నది. అందువల్ల అదనంగా భారం పడిందని చెప్పడం వాస్తవం కాదు. ఫెడరేషన్ ఆఫ్ మోటర్ స్పోర్ట్స్ క్లబ్ ఫీజు వాపసు తీసుకోవాలంటూ రాసిన లేఖపై ప్రభుత్వం స్పందించలేదు. రూ.10 కోట్లకు మించిన చెల్లింపులకు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని హెచ్ఎండీఏ రూల్స్‌లో ఎకడా లేదు. ప్రమోటర్ వాటాను ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరంలేదన్న వాదనలోనూ వాస్తవంలేదు. 2023 సెప్టెంబర్ 27న జరిగిన ముసాయిదా ఒప్పందం ప్రకారం హెచ్ఎండీఏ ప్రమోటర్‌గా ఉన్నది. పదో సీజన్ తప్పిపోకుండా ఉండేందుకు వాయిదాల ప్రకారం చెల్లింపుల నిమిత్తమే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది’ అని కేటీఆర్ వివరించారు. వచ్చే మూడేండ్లకు రూ.600 కోట్లు చెల్లించాలన్న ఏసీబీ వాదన అవాస్తవమని, ఎలాంటి అంచనా లేకుండా ఖర్చును పెంచి చూపిందని పేర్కొన్నారు.
ఏసీబీ కేసును కొట్టేయండి
‘ఫార్ములా-ఈ రేసింగ్ ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ దాఖలు చేసిన క్రిమినల్ కేసును కొట్టేయండి. కేసు నమోదు చేయడం వెనుక రాజకీయ కక్షసాధింపు ఉన్నది. వ్యక్తిగత కక్షసాధింపులు కూడా ఉన్నాయి. కేసు నమోదుకు ఎలాంటి కారణాలు లేవు. ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే, అవినీతి జరిగినట్టు ఎకడా ఆధారాలు కనబడవు. ఫార్ములా-ఈ రేస్ నిమిత్తం ప్రభుత్వం, ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో), ఏస్ నెక్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. సీజన్ 9లో రూ.110 కోట్ల లాభం వచ్చింది. ప్రభుత్వం, ఆర్గనైజర్, హెచ్ఎండీఏ మధ్య 2022 అక్టోబర్ 25న మధ్య ఒప్పందం కుదిరింది. తొలి ఏడాది ఫార్ములా కార్ రేసింగ్ నిర్వహిస్తే రూ.110 కోట్లు లాభం వచ్చింది. ప్రభుత్వమే ఒప్పందం చేసుకున్నది. అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 13(2), ఐపీసీ 409, 120-బీ సెక్షన్ల కింద కేసు నమోదు చెల్లదు’ అని కేటీఆర్ వివరించారు.
ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉంది
‘పదవ సీజన్‌కు ప్రమోటర్ వెళ్లిపోవడంతో ప్రభుత్వమే చెల్లింపులు జరిపి రేస్ నిర్వహణకు ఆమోదం చెప్పింది. 2023కు చెందిన బకాయిలను చెల్లించింది. కొత్తగా చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో అర్బిట్రేషన్ను ఎదురోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒప్పందంలో ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉన్నది. ఇప్పటికే ఉన్న ఒప్పందాన్ని అమలు చేయడానికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తించదు. ఈసీ ప్రొసీజర్ అమలు చేయలేదన్న ఆరోపణ మీద 14 నెలలకు ప్రభుత్వం ఆలస్యంగా కేసు నమోదు చేయడం చెల్లదు. తీవ్ర జాప్యానికి కారణాలు కూడా పేరొనలేదు. లలితకుమారి, చరణ్‌సింగ్ కేసుల్లో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు ఇది వ్యతిరేకం. సుప్రీంకోర్టు మూడు నెలల జాప్యానికే అనుమతించలేదు. ఈ కేసులో ఏకంగా 14 నెలలు జాప్యం జరిగింది’ అని కేటీఆర్ వెల్లడించారు.
ఒక రూపాయి కూడా నాకు చెల్లించలేదు
‘ఆర్థిక ప్రయోజనం పొందినట్టు ఒక ఆరోపణ కూడా లేదు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1)(ఎ) కింద కేసు నమోదు చేయడానికి దుర్వినియోగం ఎకడ జరిగిందో పేరొనలేదు. పిటిషనర్ సొంతానికి నిధులు ఇవ్వలేదు. పిటిషనర్‌కు చెల్లింపులు లేనప్పుడు అవినీతి జరిగిందని ఎలా కేసు నమోదు చేస్తారు. అభియోగాల మేరకు అవినీతి జరిగిందని భావిస్తే.. లబ్ధిదారులైన ప్రమోటర్స్‌పై కేసు ఎందుకు నమోదు చేయలేదు. స్పాన్సర్స్ వెళ్లిపోవడంతో ఒప్పందంలో పార్టీగా ఉన్న ప్రభుత్వం దానిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయమే లోపమైతే ప్రభుత్వమే తన నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలి. ఫార్ములా-ఈ రేసింగ్ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వమే. ఆనాటి మంత్రిగా ఆమోదం చెప్పడం జరిగింది. పీసీ యాక్ట్ సెక్షన్ 13(2) కింద కేసు నమోదుకు ఆసారం లేదు. నేరపూరిత ప్రవర్తన ఎకడ ఉన్నది? ఐపీసీ 409 కింద ఏ ఒక ఆధారమూ చూపలేదు’ అని కేటీఆర్ వివరణ ఇచ్చారు.
విధాన నిర్ణయాల్లో లోపాలుంటే..
‘అగ్రిమెంట్లో లోటుపాట్లు ఉంటే అది ప్రభుత్వ పరమైనదే అవుతుంది. రెండోసారి ఒప్పందం చేసుకున్నప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నట్టు ప్రభుత్వం చెప్పడం ఆశ్చర్యకరం. తొలి ఒప్పందం మేరకే రెండోది జరిగింది. ఫార్ములా-ఈ నిర్వహించేందుకు తేదీలు కూడా ఖరారు అయ్యాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలు వర్తించవు. తీవ్ర జాప్యంతో అంటే 14 నెలలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చట్ట వ్యతిరేకం. ప్రాథమిక విచారణ కూడా లేకుండా ఎఫ్ఐఆర్ నమోదైంది. కేవలం ప్రత్యర్థి పార్టీ నేతగా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్నందునే కేసు నమోదు చేశారు. పీసీ యాక్ట్‌లోని 13(1)ఏ ప్రకారం చట్టసభ ప్రతినిధి నిధుల దుర్వినియోగం అభియోగాలు ఉంటేనే కేసు నమోదు చేయాలి. స్పాన్సర్లు వెళ్లిపోయారని చెప్పి ప్రభుత్వం.. నిర్వాహకులు కూడా వెళ్లిపోయేలా చేసింది. ఇకడ డబ్బులు తీసుకున్న నిర్వాహకులపై కేసు పెట్టకుండా నాటి మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిన నాపై లేని అవినీతి గురించి కేసు నమోదు చేయడం దారుణం. అభియోగాలకు ఆధారాలు ఐపీసీ 409 సెక్షన్ కూడా వర్తించదు’ అని కేటీఆర్ అన్నారు.
చెల్లింపులు చేశాక ప్రభుత్వానికే నష్టం
‘గతేడాది సెప్టెబర్ 25న సీజన్ టెన్ ప్రమోటర్స్ ఫీజుగా 2 విడతలుగా 22.5 లక్షల పౌండ్లు (జీబీపీ) చొప్పున ప్రభుత్వం చెల్లింపులు చేశాక (భారత కరెన్సీ ధరల ప్రకారం తొలి విడత రూ.23,69,63,125, రెండో విడత పౌండ్ విలువ మారిన కారణంగా రూ.23,01,97,500 చొప్పున) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హిమాయత్‌నగర్ బ్రాంచ్ ద్వారా యూకేలోని ఫార్ములా-ఈ సంస్థకు చెల్లింపులు చేశాక మూడో విడత చేయకపోవడంతో సీజన్ 10 ఆగిపోయింది. అగ్రిమెంట్ ప్రకారం సీజన్ 10 ఫార్ములా ఈ ఏడాది ఫిబ్రవరి 10, 11 తేదీల్లో జరగాలి. అయితే 25% చొప్పున (26 సెప్టెంబర్, 4 అక్టోబర్-2023) 2 వాయిదాలు అంటే 50% సొమ్ము చెల్లించిన ప్రభుత్వం ఆఖరి విడత సొమ్ము చెల్లించకపోవడంతో సీజన్ 10 ఈవెంట్ జరగలేదు. ఫార్ములా-ఈ లీగల్ డైరెక్టర్ గత ఏడాది డిసెంబర్ 23న రాసిన లేఖలో గత డిసెంబర్ 26లోగా మిగిలిన 50% చెల్లిస్తే సీజన్ 10 నిర్వహిస్తామని చెప్పి నా ప్రభుత్వం చేయలేదు. గత ఏడాది డిసెంబర్ 19న కూడా మరో లేఖ కూడా రాసినప్పటికీ ప్రభుత్వంలో కదలిక రాలేదు. ఈ లేఖల ప్రకారం ఫార్ములా-ఈ ఆపరేషన్లకు 50% మొత్తాన్ని ప్రభుత్వం చెల్లింపుల్లో వైఫల్యం కారణంగా ముందుగా చేసిన 50% చెల్లింపులు వృథా అయ్యాయి. రెండు విడతలు చెల్లించిన తర్వాత కూడా నిర్వహించలేకపోయింది. ఫార్ములా-ఇ చాంపియన్ షిప్ అనేది ప్రపంచంలోని ప్రీమియర్ ఎలక్ట్రిక్ కార్ స్ట్రీట్ రేసింగ్ సిరీస్. ఇది 2014లో అత్యాధునిక సాంకేతికతతో ప్రారంభమైంది. థ్రిల్లింగ్ మోటర్ స్పోర్ట్ చర్యను మిళితం చేస్తుంది. క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి, ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి దోహదం చేస్తుంది’ అని కేటీఆర్ రిప్లయ్ కౌంటర్లో తెలిపారు.
కుట్ర, రాజకీయ కక్షతోనే కేసు
‘అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 13(1)(ఏ), సెక్షన్ 13(2) శిక్షార్హమైనవి ఈ కేసులో నాకు వర్తించవు. ఐపీసీలోని 120-బీ, 409 సెక్షన్ల కింద కేసు నమోదు వెనుక కుట్ర ఉన్నది. ఇలాంటి తీవ్ర నేరాభియోగాలతో కేసు నమోదు చేస్తే 41 (ఏ) నోటీసు ఇచ్చి పిటిషనర్‌ను విచారణ చేయాల్సిన అవసరం లేకుండా చేయాలనే కుట్ర దాగి ఉన్నది. వేధింపులు, రాజకీయ కుట్రతో జైలుకు పంపాలనే కుయుక్తి గూడుకట్టుకుని ఉన్నది. అగ్రిమెంట్స్ జరిగినట్టుగా, అదీ ప్రభుత్వ ఆధీనంలో జరిగినట్టుగా పత్రాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా తనను లక్ష్యం చేసుకుని ప్రభుత్వం కేసు బనాయించింది’ అని కేటీఆర్ 14 పేజీల రిప్లయ్ కౌంటర్లో పేరొన్నారు.
నిర్వాహకులను నిందితులుగా ఎందుకు చేర్చలేదు?
‘సీజన్-9 ఫిబ్రవరి 2023లో హైదరాబాద్‌లో జరిగినప్పుడు దేశ, విదేశాలకు చెందిన 35 వేల మంది వీక్షించారు. ఇ-ప్రిక్స్‌కు అంతర్జాతీయ సందర్శకులు కూడా హాజరయ్యారు. హోర్డింగ్స్, హాస్పటాలిటీస్, అడ్వర్టైజింగ్, టూరిజం ఇతర లావాదేవీల ద్వారా రాష్ట్రానికి రూ.700 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. భారత దేశంలో ఫార్ములా-ఈ రేసింగ్ నిర్వహించిన ఏకైక నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఇప్పటివరకు న్యూయార్, లండన్, ప్యారిస్, బెర్లిన్, బీజింగ్, సియోల్ వంటి నగరాల్లో జరిగింది. ఈవెంట్ నిర్వహణ వల్ల రాష్ట్రానికి చేకూరిన ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం వదిలేసి రాజకీయ కక్షతో తప్పుడు కేసు బనాయించింది. కుట్ర పన్నారనేదే నిజమని భావిస్తే ప్రభుత్వం ఫార్ములా-ఈ రేసింగ్ నిర్వాహకులను నిందితులుగా ఎందుకు చేర్చలేదు? ఈ ఒక కోణం నుంచి చూస్తే కేసు కుట్రపూరితమని అర్ధం అవుతున్నది. ప్రమోటర్ నిందితుడు కానప్పుడు ఐపీసీ 120బీ కింద కుట్ర జరిగిందని ఆరోపణ చేయడం చెల్లదు. ఇది పూర్తిగా సివిల్ వివాదం అవుతుంది’ అని కేటీఆర్ తెలిపారు.