హైదరాబాద్, జూన్ 5 (నమస్తేతెలంగాణ): సింగరేణి ప్రకటించిన నిల్వల నుంచి 40 లక్షల టన్నుల బొగ్గు ఎలా మాయమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘రేవంత్‌రెడ్డి అప్పనంగా అమ్ముకున్నారా? రూ.1,600 కోట్ల విలువైన స్కామ్‌పై బీఆర్ఎస్ ఆధారాలతో ఫిర్యాదు చేసినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడంలేదు?’ అంటూ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్ల పాలనలో సింగరేణి స్కామ్‌లకు కేరాఫ్‌గా మారిందని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రేవంత్, కిషన్‌రెడ్డి మిలాఖత్ కాకుంటే సింగరేణిలో భారీ బొగ్గు కుంభకోణంపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజల ఆస్తి అయిన సింగరేణి మనుగడను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిలో బట్టబయలైన రూ. 1,600 కోట్ల భారీ కుంభకోణం కార్మికలోకాన్ని తీవ్రంగా కలవరపరుస్తున్నదని వాపోయారు.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత వరుస కుంభకోణాలు..
కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత వరుస స్కామ్‌లతో సింగరేణి వణికిపోతున్నదని, రూ.1,600 కోట్ల విలువచేసే బొగ్గును మాయం చేసి సంస్థ గొంతుకొసే కుట్రకు తెరతీశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 40 లక్షల టన్నుల బొగ్గుపై కోల్సెస్, ఐటీ కట్టినమని లెక్కలు చూపుతున్నారని, సంస్థ అధికారిక వెబ్సైట్ రికార్డుల్లో ఏడు గనుల వద్ద బొగ్గు స్టాక్ ఉన్నదని నమోదైందని, కానీ క్షేత్రస్థాయిలో నిల్వలు కనిపించడం లేదని, బొగ్గు మాయం వెనుక ఎవరి హస్తం ఉన్నదో తేల్చాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించి, బొగ్గు గనుల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్‌రెడ్డి హయాంలో ఇంత పెద్ద కోల్ కుంభకోణం జరగడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. ‘ఏప్రిల్ నెలాఖరుకు మందమర్రిలో 7,20,000 టన్నులు, శ్రీరాంపూర్‌లో 8 లక్షల టన్నులు, రామగుండం-1లో 6 లక్షలు, రామగుండం-2లో 4 లక్షలు, భూపాలపల్లిలో 5.40 లక్షలు, ఇల్లందులో 3.50 లక్షలు, సత్తుపల్లిలో 2 లక్షల మెట్రిక్ టన్నులు మొత్తంగా సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నదని లెక్కలు చూపించారని, కానీ కోల్ స్టాక్ పాయింట్ల వద్ద ఆ బొగ్గు నిల్వలు కనిపించడంలేదని వెల్లడించారు. స్కామ్‌కు ఇదే అతిపెద్ద ఆధారమని స్పష్టంచేశారు. ఏప్రిల్‌లో గనులపై బొగ్గు నిల్వలు తనిఖీ చేసే బొగ్గు గనుల శాఖ అధికారులు రాకపోవడం, కాగ్ సైతం తనిఖీలు చేపట్టకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తున్నదని కుండబద్దలు కొట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 40 లక్షల బొగ్గును పక్కదారి పట్టించాయా? అనే సందేహాలు కార్మికలోకాన్ని వెంటాడు తున్నాయని స్పష్టంచేశారు. ఈ స్కామ్‌ను దాచిపెట్టే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్షాన్ని గనుల వద్దకు పంపాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఈ అక్రమాల పుట్టబద్దలవుతుందని లేఖలో కోరారు.
సింగరేణిని కబళించే కుట్రలు..
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి సింగరేణిని కబళించే కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ మాటున కోరుకున్న వారికి టెండర్లు కట్టబెట్టే కుతంత్రాన్ని అమలు చేశారని విమర్శించారు. సాక్షాత్తు సీఎం బావమరిది సృజన్‌రెడ్డి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరుగుతున్నదని తెలిసినా ఎందుకు మిన్నకుంటున్నారని ప్రశ్నించారు. నైని కోల్‌స్కామ్ దేశవ్యాప్తంగా దుమారం రేపిందని, ఈ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టగానే ఆగమేఘాలపై డిప్యూటీ సీఎం టెండర్లు రద్దుచేస్తున్నట్టు ప్రకటించారని గుర్తుచేశారు. కానీ అక్రమార్కుల భరతంపట్టే దిశగా ఒక్క అడుగుకూడా వేయలేదని విమర్శించారు. టెండర్ పోటీదారులను బెదిరించి, భయపెట్టి తప్పించేలా సాగిన పన్నాగాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. ఈ టెండర్లలో జరిగిన అక్రమాల నిగ్గుతేల్చేందుకు కేంద్రం వేసిన కమిటీ ఇప్పటివరకు ఏం తేల్చిందో కూడా తెలియడంలేదని దెప్పిపొడిచారు. నైని స్కామ్‌పై సమగ్ర విచారణ జరిపి మూడురోజుల్లో నివేదించాలని ఆదేశించిన మోదీ ప్రభుత్వం ఎందుకు మొద్దునిద్రపోతున్నదో? కార్మికులకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ‘అసలు బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియా పాటించే విధానాలేంటి? సైట్ విజిట్ సర్టిఫికెట్ సిస్టమ్‌ను ఎవరి ప్రయోజనాల కోసం తెచ్చారు? ఆఖరుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను ఎలా పక్కదారి పట్టించారు? అనే అంశాలపై నిజాలు నిగ్గుతేల్చకపోవడం కాంగ్రెస్ సీఎం రేవంత్‌తో మీకున్న లోపాయికారి ఒప్పందాలను బట్టబయలు చేస్తున్నది’అంటూ విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందాలు
నైని స్కామ్‌తో పాటు 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల నిబంధనలకు పాతరేసి, జాతీయస్థాయిలో సగటుకు మించి అత్యధిక ధరలకు టెండర్లు కట్టబెట్టి అక్రమాలకు తెరలేపారని కేటీఆర్ వివరించారు. ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి డీజిల్ కొనుగోలు చేసే విధానాన్ని అర్ధాంతరంగా రద్దుచేసి దోపిడీకి పాల్పడ్డారు. పేలుడు పదార్థాల కొనుగోళ్లలో కోల్ ఇండియా కంటే 30 శాతం అధిక నిధులు చెల్లించి అనుయాయులకు కట్టబెట్టారు. చివరికీ మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు రూ. 110 కోట్ల సింగరేణి నిధులను దుర్వినియోగం చేసినా కేంద్రం పట్టించుకోలేదు’అని దుయ్యబట్టారు. వరుస స్కామ్‌లు జరుగుతున్నా అక్రమార్కుల భరతం పట్టకుండా కేంద్రం మీనమేషాలు లెక్కించడం శోచనీయమని వాపోయారు. దీని వెనుక కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందాలే కారణమని కార్మికులకు అర్థమైపోయిందని స్పష్టంచేశారు. సింగరేణిలో అక్రమ దందాలను వెలుగులోకి తెచ్చేందుకు చివరికీ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన వివరాలు బయటకు రాకుండా దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత వరుస స్కామ్‌లతో వణికిపోతున్న సింగరేణిలో రూ.1,600 కోట్ల విలువచేసే బొగ్గును మాయం చేసి సంస్థ గొంతుకొసే కుట్రకు తెరతీసిండ్రు. సంస్థ అధికారిక వెబ్సైట్ రికార్డుల్లో ఏడు గనుల వద్ద బొగ్గు స్టాక్ ఉన్నదని నమోదైంది. కానీ క్షేత్రస్థాయిలో నిల్వలు కనిపించకపోవడం ఈ స్కామ్ జరిగినట్టు తేటతెల్లం చేస్తున్నది. 40 లక్షల టన్నుల బొగ్గుపై కోల్సెస్తో పాటు, ఐటీ కట్టినమని లెక్కలు చూపుతున్నరు..బొగ్గు మాయం వెనుక ఎవరి హస్తం ఉన్నదో తేల్చాల్సిన అవసరమున్నది. -కేటీఆర్
విచారణ జరుపకుంటే బీఆర్ఎస్ జంగ్‌సైరన్
కాంగ్రెస్ పాలనలో సింగరేణిలో వరుస కుంభకోణాలు జరుగుతుంటే కేంద్ర మంత్రి హాదాలో ఉన్న కిషన్‌రెడ్డి పట్టించుకోకపోవడంతో సింగరేణి కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నదని కేటీఆర్ హెచ్చరించారు. ఏదేమైనా సింగరేణిని నిర్వీర్యం చేసి వేలాది కార్మికుల పొట్టగొట్టే కాంగ్రెస్-బీజేపీ కుట్రలను బీఆర్ఎస్ ఎప్పటికీ సహించబోదనే విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తుంచుకోవాలని హితవుపలికారు. సీఎంతో రహస్య ఒప్పందాల ముసుగులో సింగరేణిని బలిపెట్టవద్దని డిమాండ్ చేశారు. రూ. 16,00 కోట్ల కోల్స్కామ్పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే ఊరుకొనేదిలేదని, కార్మికలోకంతో కలిసి కాంగ్రెస్-బీజేపీ సర్కార్లపై జంగ్‌సైరన్ మోగిస్తామని హెచ్చరించారు.