పదేండ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వ ఖజానా నింపే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దినందుకు రాష్ర్టానికి మీరిచ్చే బహుమానం ఈ అవమానాలేనా? 2014 నుంచి 2024 వరకు పదేండ్లలోనే రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అసలు అప్పులపై మాట్లాడే నైతిక హకేలేదు. – కేంద్రమంత్రికి రాసిన లేఖలో కేటీఆర్
KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా అప్పులు చేసిన బీజేపీ నేతలు తమపై అభాండాలు మోపడం తగదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవుపలికారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 14 మంది ప్రధానులు 65 ఏండ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. పదేండ్లలోనే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఇంత పెద్దమొత్తంలో అప్పులు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హకేలేదని మండిపడ్డారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపిననాడు కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని స్పష్టంచేశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన సమయంలోనూ రాష్ర్టానికి దాదాపు 70 వేల కోట్ల వరకు అప్పు ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలన తర్వాత కూడా తెలంగాణను మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే కాంగ్రెస్‌కు అప్పజెప్పామని స్పష్టం చేశారు. పార్లమెంట్లో తెలంగాణపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ చులకనగా మాట్లాడటంపై మండిపడ్డారు. అసలు అప్పులకు మిగులు బడ్జెట్‌తో ముడిపెట్టడం సమంజసం కాదని హితవుపలికారు. ప్రతి కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి నిధులివ్వని బీజేపీని తెలంగాణ ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు.
125 లక్షల కోట్లతో ఏం చేశారు?
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో అప్పుగా తెచ్చిన ప్రతీ పైసాను పెట్టుబడిగా మార్చి తెలంగాణ నేలపై విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన విషయాన్ని యావత్ దేశం చూసిందని కేటీఆర్ గుర్తుచేశారు. దశాబ్దాలుగా తీవ్ర విధ్వంసానికి గురైన తెలంగాణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చి దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన తీరు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులే సాక్ష్యమని తెలిపారు. అప్పులు ఉన్నంత మాత్రాన ఒక రాష్ర్టాన్ని వెనుకబడినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం సరికాదని హితవుపలికారు. తెచ్చిన అప్పులను దేనికోసం ఖర్చుపెట్టారనేదే అత్యంత కీలకమైన విషయమని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పదేండ్ల్లలో తెచ్చిన రూ.125 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పే పరిస్థితి లేదని విమర్శించారు. కానీ, దశాబ్దాలపాటు ఈ నేలను పట్టి పీడించిన తాగు, సాగునీటి కష్టాలను తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పుతో శాశ్వతంగా నిర్మూలించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మించామని తెలిపారు. వ్యవసాయంతోపాటు పారిశ్రామికరంగాన్ని వెంటాడిన చిమ్మచీకట్లను శాశ్వతంగా పారదోలేందుకు భారీ విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణానికి, రాష్ట్రంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను ఉపయోగించిన విషయం తెలంగాణ సమాజానికి తెలుసని, వాటి ఫలితాలను రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారని వివరించారు.
పసుపు బోర్డుకు పైసా ఇచ్చారా?
‘బీఆర్ఎస్ పదేండ్ల్ల పాలనలో కేంద్ర ప్రభు త్వ ఖజానా నింపే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దినందుకు రాష్ర్టానికి మీరిచ్చే బహుమానం ఈ అవమానాలేనా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డుకు పైసా కూడా కేటాయించకుండా మాటలకే పరిమితం కావడం అత్యంత దారుణమని మండిపడ్డారు. బోర్డు చైర్మన్‌కు కనీసం కూర్చోవడానికి కార్యాలయం కూడా ఇవ్వకపోవడం, పసుపు బోర్డు పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని ఫైరయ్యారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దుచేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని పదేండ్ల్లలో పదులసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం వినిపించుకోలేదని విమర్శించారు. దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్లో ఇచ్చిన హామీలకు దశాబ్దం గడిచినా మోక్షం లేకపోవడం నయవంచన కాదా? అని ప్రశ్నించారు.
బురదజల్లి తప్పించుకోలేరు
బీఆర్ఎస్ ప్రభుత్వం సొంత ఖర్చులతో చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా వందశాతం ఇండ్లకు మంచినీళ్లిచ్చే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామని కేటీఆర్ స్పష్టంచేశారు. దానిని కూడా జల్ జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చినట్టు కేంద్రం ఖాతాలో వేసుకోవడం విడ్డూరమని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరిపించి యువతకు ఉపాధి కల్పించాలని పదేపదే విజ్ఞప్తిచేశామని గుర్తుచేశారు. అయినా, కేంద్రం వినిపించుకోకపోవడం ఆ ప్రాంత ప్రజల పట్ల బీజేపీకి ఉన్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. కేంద్రంలో 11 ఏండ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి దకిందేమీ లేదని ఫైరయ్యారు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా ఎనిమిది పైసలు కూడా తేలేదని, వారి అసమర్థతను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నాటి అప్పులపై బురదజల్లి తప్పించుకోలేరని, బీజేపీ చేసిన తప్పులను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరని కేటీఆర్ హెచ్చరించారు.
మీలా కార్పొరేట్ల రుణాలు మాఫీ చేయలేదే!
బీఆర్ఎస్ హయాంలో ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి చేసిన అప్పును కేంద్రం తప్పుగా చూపించే ప్రయత్నాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా తెచ్చిన అప్పులతో కార్పొరేట్ శక్తులకు చెందిన లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయలేదనే విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తుపెట్టుకోవాలని హితవుపలికారు. పంటల దిగుబడిలో పంజాబ్‌నే తలదన్నే స్థాయికి తెలంగాణ ఎదిగిందంటే దానికి ప్రధాన కారణం.. తెచ్చిన అప్పులతో సంపద సృష్టించే బృహత్తర కార్యక్రమాలు చేపట్టడమేనని స్పష్టంచేశారు. అటు కేంద్ర బడ్జెట్లో, ఇటు రైల్వే కేటాయింపుల్లో తెలంగాణపై బీజేపీ సర్కారు సవతి ప్రేమ కనబరుస్తున్నదని విమర్శించారు. అధికారంలోకి రాగానే తెలంగాణలోని ఏడు మండలాలను, లోయర్ సీలేరు విద్యుత్తు ప్రాజెక్టును లాకొని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం గొంతుకోసిన విషయాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని పేర్కొన్నారు.
కేంద్రం ఖజానా నింపే తెలంగాణకు న్యాయంగా దకాల్సిన వాటాను ఇవ్వాలని, విభజన హకులను నెరవేర్చాలని డిమాండ్ చేసినందుకు కేంద్ర మంత్రి పియూశ్ గోయెల్, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. సమైక్యరాష్ట్రంలో తీవ్ర విధ్వంసానికి గురైన తెలంగాణ ముఖచిత్రాన్ని, ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా మార్చి దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులే ఇందుకు నిదర్శనం. బీఆర్ఎస్ సర్కార్ పదేండ్ల కాలంలో అప్పుగా తెచ్చిన ప్రతీ పైసాను పెట్టుబడిగా మార్చి తెలంగాణ నేలపై విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన విషయాన్ని యావత్ దేశం చూసింది.
– కేంద్రమంత్రికి లేఖలో కేటీఆర్
బీఆర్ఎస్ హయాంలో ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి చేసిన అప్పును కేంద్రం తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నది. తెచ్చిన అప్పులతో కేంద్ర ప్రభుత్వం మాదిరిగా మేము కార్పొరేట్ శక్తుల లక్షల కోట్ల లోన్లు మాఫీ చేయలేదనే విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తుపెట్టుకోవాలి.
– కేంద్రమంత్రికి లేఖలో కేటీఆర్