KTR | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల హక్కులు, వారికి ఉండే ప్రొటోకాల్‌ను స్పీకర్ పరిరక్షించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల హకుల రక్షణ విషయంలో స్పీకర్ తన అధికారాలను వినియోగించాలని, ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా ప్రభుత్వ ప్రధానకార్యదర్శితోపాటు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కావాలనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విపక్ష ఎమ్మెల్యే హకులకు భంగం కలిగిస్తూ, ప్రజాస్వామిక స్ఫూర్తిని కాలరాస్తున్నదని దుయ్యబట్టారు. ప్రతి సందర్భంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. తమ పదేండ్ల పాలనలో ఎప్పుడూ ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడలేదన్నారు.
కాంగ్రెస్ నాయకులే ప్రజాప్రతినిధులా?
ఎమ్మెల్యేలకు స్థానిక నియోజకవర్గంలో జరిగే ఏ పనికి సంబంధించైనా ప్రొటోకాల్ ఉంటుందని, కాంగ్రెస్ నాయకులు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అవమానించే విధంగా ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కల్యాణిలక్ష్మి చెకుల పంపిణీతోపాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు అందించాల్సిన చెకులను స్థానిక ఎమ్మెల్యేను కాదని కాంగ్రెస్ నాయకులే పంపిణీ చేస్తున్నారని ఉదహరించారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభ కార్యక్రమాలను ఎమ్మెల్యే లేకుండానే పూర్తి చేస్తున్నరని అభ్యంతరం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట పోటీ చేసి, ఓడిపోయిన అభ్యర్థి, లేదంటే అకడి కాంగ్రెస్ నాయకులే ఎమ్మెల్యేలు అన్నట్టుగా వ్యవహారం సాగుతున్నదని మండిపడ్డారు.
హుజూరాబాద్, మహేశ్వరం, ఆసిఫాబాద్, జనగామ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలకు యథేచ్ఛగా పాల్పడుతూ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలపైనే ఎదురుదాడి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంలోని పెద్దల బెదిరింపుల కారణంగా అధికారులు సైతం వాళ్లు చెప్పిన విధంగా చేసే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అప్రజాస్వామిక సంఘటనలు ఎంత మాత్రం సరైనవి కావని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఏడు నెలలుగా ప్రొటోకాల్ ఉల్లంఘనలు వరుసగా జరుగుతున్నాయని, ఈ విషయాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ దృష్టికి తేవాలనే ప్రయత్నం చేసినా అందుబాటులో లేరని పేర్కొన్నారు.
ప్రొటోకాల్‌ను పరిరక్షించాలి
ఎమ్మెల్యేల హకులను, వారికి ఉండే ప్రొటోకాల్‌ను పరిరక్షించే విషయంలో పూర్తి అధికారం స్పీకర్దేనని కేటీఆర్ గుర్తుచేశారు. ఎమ్మెల్యేల హకులు, ప్రొటోకాల్, వారి గౌరవానికి భంగం కలగకుం డా చూసుకోవాల్సిన బాధ్యత స్పీకర్‌పైనే ఉన్నదని పేర్కొన్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో ఏ విధంగా ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారో మీడియా ద్వారా కూడా వెలుగుచూసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల హకుల రక్షణ విషయంలో స్పీకర్ తన అధికారాలను వినియోగించాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రొటోకాల్ పరిరక్షణ కోసం వెంటనే సీఎస్ సహా అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.