హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): డాలస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలు విజయవంతం కావడానికి కృషి చేసిన అక్కడి కొంత మంది వ్యక్తుల మధురమైన జ్ఞాపకాలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం స్మరించుకున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. వారి పేర్లను పోస్ట్‌లో పేర్కొన్నారు. డాలస్‌లో సహకరించిన శ్రావణి, ఉదయ్‌కుమార్‌రెడ్డి దంపతుల గురించి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి పిల్లలకు కేసీఆర్ అని పేరు కూడా పెట్టారని తెలిపారు. కట్టా ఐద్వెత్ చంద్రారెడ్డి(కేసీఆర్), కట్టా అద్విక్ చంద్రారెడ్డి(కేసీఆర్) అని వారి పిల్లలకు పేర్లు పెట్టారని, చాలా సంతోషమని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై తన ప్రేమను చూపించడానికి 2000 మైళ్ల్లు కారు నడుపుకుంటూ వచ్చిన కిశోర్‌ను కేటీఆర్ ఎక్స్ ద్వారా ప్రత్యేకంగా అభినందించారు. బీఆర్ఎస్ మరో అభిమాని ప్రవీణ్‌రెడ్డి కోలన్ తన గడ్డానికి గులాబీ రంగు వేసుకునేంత వరకు వెళ్లారని చెప్పారు. ఆయన ఉల్లాసం, ఉత్సాహానికి మంత్రముగ్ధుడయ్యానని తెలిపారు. వారి పేరును కూడా ఎక్స్‌లో పోస్టు చేశారు. గొప్ప మద్దతుదారుడు శశాంక్ వెలగాల కుటుంబ సభ్యులను కలిసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన వారికి ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు మద్దతు ఇచ్చి.. విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.