KTR | హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఓఆర్ఆర్ లీజు విషయంలో కాంగ్రెస్ మంత్రులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే ఆరోపణలు చేస్తుండటంపై జాలేస్తున్నదని కేటీఆర్ అన్నారు. ఓఆర్ఆర్ లీజును బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టమొచ్చిన ధరకు ఓ సంస్థకు అప్పగించిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేటీఆర్.. ‘బీఆర్ఎస్ నిజంగానే తకువ ధరకు లీజుకు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? మేం తక్కువ ధరకు లీజుకు ఇచ్చింది నిజమే అయితే సదరు లీజును రద్దు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
టీవోటీ (టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) లీజును రద్దు చేసి తాజాగా కొత్త బిడ్లు పిలవాలని సవాల్ విసిరారు. చేతిలో ఉన్న పని చేయకుండా బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తే ప్రజలు సహించరని తేల్చిచెప్పారు. ఓఆర్ఆర్ లీజు విషయంలో తాము ఎన్హెచ్ఏఐ నిబంధనలనే అనుసరించామని స్పష్టంచేశారు. ఆ లీజు విషయంలో తప్పు జరిగి ఉంటే సర్కార్ చర్యలు తీసుకోవచ్చని.. బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే ఎంతోకాలం దాగదని వెల్లడించారు.