హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ పోలీస్‌స్టేషన్ లో నమోదైన కేసులో ఈ నెల 12 వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని హైకోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టులో జరిగే విచారణకు హాజరుకాకుండా కూడా కేటీఆర్‌కు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు గతంలో జారీచేసిన ఉత్తర్వులను గురువారం మరోసారి పొడిగించింది. కేటీఆర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాలసుమన్కు కూడా ఈ వెసులుబాటు కల్పించింది. తమ వాదనలతో కౌంట ర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన పోలీసులు, ఫిర్యాదుదారు అయిన నీటిపారుదల శాఖ సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వలిషేక్ను ఆదేశించింది. గత ఏడాది జూలై 26న మేడిగడ్డ బరాజ్‌ను కేటీఆర్, వెంకటరమణారెడ్డి, బాలసుమన్ సందర్శించారు.
అనుమతి లేకుండా అక్కడ డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించారని ఇంజినీర్ వలిషేక్ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మహదేవ్పూర్ పోలీసులు బీఆర్ఎస్ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎలాంటి తప్పు చేయకున్నా తమపై నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేటీఆర్, వెంకటరమణారెడ్డి, సుమన్ దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌కే లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటిని ఎత్తిపోయకపోవడంతో వానకాలం వ్యవసాయ సీజన్‌కు నీటి కొరత ఏర్పడి రైతులకు నష్టం వాటిల్లిందని, వాస్తవాలను వెలికితీసేందుకు కేటీఆర్, ఇతర నాయకులు బ్యారేజీని సందర్శించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు.