దేశంలో పెరుగుతున్న కార్పొరేట్ ఏక ఛత్రాధిపత్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ఇందుకు ఇండిగో సంక్షోభమే ఉదాహరణ. ఇండిగో, ఎయిరిండియా సంస్థలకు విమానయానంలో గుత్తాధిపత్యం కట్టబెట్టడం, కేంద్రం తెచ్చిన ఏవియేషన్ సంస్కరణలే ఇందుకు కారణం. చివరికి కేంద్రమే దిగివచ్చి సంస్కరణలను వెనక్కితీసుకోవాల్సిన దుస్థితి. ఆ నాలుగు లేబర్కోడ్లు అమల్లోకి వస్తే ఇలాంటి అనర్థాలే తలెత్తుతయి. ఈ అరాచకం అన్ని రంగాలకు విస్తరిస్తది.
-కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ల గుత్తాధిపత్యం దేశానికి ప్రమాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లపై తెలంగాణ నుంచే పోరాటం మొదలు పెడుతామని, బోధించు, సమీకరించు, పోరాడు అని అంబేద్కర్ ఇచ్చిన నినాద స్ఫూర్తితో ఉద్యమిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు లేబర్కోడ్ల అమలును నిలిపివేసేదాకా అసెంబ్లీ, మండలిని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. అవసరమైతే రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కార్మికలోకానికి చేస్తున్న అన్యాయాన్ని బీఆర్టీయూ, బీఆర్ఎస్ ఆధ్వరంలో కార్మిక సంఘాలు, కలిసివచ్చే వర్గాలతో కలిసి ఎండగడతామని తేల్చిచెప్పారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్టీయూ అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో ‘నాలుగు లేబర్ కోడ్లు-శ్రమ్, శక్తి,నీతి..’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్, అసెంబ్లీలో జరిగే చర్చలకన్నా తెలంగాణ భవన్లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో అర్థవంతమైన చర్చ జరిగిందని అభిప్రాయపడ్డారు. దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుతూ భారతదేశం వైరుధ్యాల పుట్ట అని, ఇది వైవిధ్య భారతమని, అత్యంత సంపన్నులు, కడు పేదలున్నది మనదేశంలోనేనని పేర్కొన్నారు. కానీ పాలకులు ఇక్కడి పరిస్థితులు, సమాజంలో వైరుధ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా అమెరికా, ఐరోపా దేశాల కోసం రూపొందించిన చట్టాలు, విధానాలను గుడ్డిగా అమలు చేయడం శోచనీయమని విమర్శించారు.
ఎన్నో ఏండ్లుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లను రూపొందించడం దుర్మార్గమని మండిపడ్డారు. ట్రేడ్ యూనియన్లు, పార్టీలు, మేధావులు, నిపుణుల అభిప్రాయాలను తీసుకోకుండా కేంద్రం నియంతృత్వ ధోరణితో ముందుకెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాలకులు తెచ్చే సంస్కరణలు మానవీయ కోణంలో ఉండాలని స్పష్టం చేశారు. కానీ మనదేశంలో దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితి లేదని వాపోయారు. స్థానిక పరిస్థితులు, పేదరికాన్ని పరిగణనలోకి తీసుకోకుండా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరిట సంస్కరణలు తీసుకురావడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. తెలంగాణలో 92 లక్షల కుటుంబాలకు తెల్లరేషన్ కార్డులు ఉండటమే ఇందుకు నిదర్శమని ఉదహరించారు.
కేంద్రం తీసుకువస్తున్న లేబర్కోడ్లను ఢిల్లీ కాంగ్రెస్ వ్యతిరేకించిందని, పార్లమెంట్ సాక్షిగా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కేంద్రం వైఖరిని ఎండగట్టారని కేటీఆర్ గుర్తుచేశారు. సోనియాగాంధీ వద్దన్న బిల్లును కూడా తెలంగాణలోని రేవంత్ సర్కారు అమలు చేయాలని నిర్ణయించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఒకే బిల్లుపై ద్వంద్వ విధానమెందుకని నిలదీశారు. కానీ బీఆర్ఎస్ మాత్రం నిర్దంద్వంగా వ్యతిరేకించిందని స్పష్టంచేశారు. లోక్‌సభలో తమ పార్టీ సభ్యులు లేనందున రాజ్యసభలో గళమెత్తామని గుర్తుచేశారు. కేంద్రం తీసుకువస్తున్న లేబర్కోడ్లను రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇందుకు బీఆర్ఎస్, బీఆర్టీయూ సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికలు లేనందున అన్ని కార్మిక సంఘాలు, ఎర్రజెండా యూనియన్లను కలుపుకొని వెళ్తామని స్పష్టం చేశారు. అవసరమైతే బీఆర్టీయూ దిగొచ్చి జేఏసీగా ఏర్పడి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, శాసనసభ, మండలిని స్తంభింపజేస్తామని హెచ్చరించారు.
కేసీఆర్ పదేండ్ల పాలన మానవీయకోణంలోనే సాగిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఇదే కోవలో వృద్ధులు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు అందించారని పేర్కొన్నారు. సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకొనేందుకు మహిళలకు పండుగ కానుకగా అందించే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చారని చెప్పారు. ఇందుకోసం ఏటా 350 కోట్ల చొప్పున పదేండ్లలో సుమారు రూ.3,500 కోట్లు ఖర్చుచేసి నేత కార్మికులకు ఉపాధి కల్పించి ఆదుకున్నారని స్పష్టంచేశారు. ప్రతిపక్షంలో ఉండగా నేతన్నల ఆత్మహత్యలను చూసి చలించిపోయి రూ.50 లక్షల ఆర్థిక సహాయనిధి సమకూర్చారని గుర్తుచేశారు. ఈ నిధి ద్వారా నేతన్నలకు రుణాలు ఇప్పించి ఆపదకాలంలో భరోసానిచ్చారని తెలిపారు. ప్రభుత్వాలు పేదలు, అణగారిన వర్గాలను విస్మరిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
భారతదేశం వైరుధ్యాల పుట్ట.. అత్యంత సంపన్నులు, కడు పేదలు ఉన్నది మనదేశంలోనే. కానీ పాలకులు ఇక్కడి పరిస్థితులను, సమాజంలోని వైరుధ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా అమెరికా, ఐరోపా దేశాల కోసం రూపొందించిన చట్టాలు, విధానాలను గుడ్డిగా అమలు చేయడం శోచనీయం. ఎన్నో ఏండ్లుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లను రూపొందించడం దుర్మార్గం.
-కేటీఆర్
రాజకీయ లబ్ధికోసం పనికిరాని, ప్రజలకు మేలు చేయని విధానాలను తెరపైకి తేవడం వల్లే భారతదేశం ఆర్థికంగా వెనుకబడి పోయిందని కేటీఆర్ విశ్లేషించారు. 1985 వరకు చైనా జీడీపీ మనదేశం కన్నా తక్కువగా ఉండేదని, కానీ 40 ఏండ్లలో ఆ దేశం 60 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే భారత దేశం మాత్రం 4 ట్రిలియన్ల వద్దే ఉండిపోయిందని వివరించారు. చైనా వారి దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా విధానాల్లో మార్పులు చేసుకుంటూ, మానవవనరులను వినియోగించుకుంటూ అభివృద్ధి పథంలో పురోగమించిందని స్పష్టంచేశారు. అక్కడ నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలకు మద్దతు ఇస్తూ, లాభాల్లో ఉన్నప్పుడు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించిందని పేర్కొన్నారు.
రాజకీయ లబ్ధికోసం పనికిరాని, ప్రజలకు మేలు చేయని విధానాలను తెరపైకి తేవడం వల్లే భారతదేశం ఆర్థికంగా వెనుకబడింది. 1985 వరకు చైనా జీడీపీ మనదేశం కన్నా తక్కువ ఉండేది. కానీ 40 ఏండ్లలో ఆ దేశం 60 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే భారత దేశం మాత్రం 4 ట్రిలియన్ల వద్దే ఉండిపోయింది.
-కేటీఆర్
భారతదేశంలో పెరిగిపోతున్న కార్పొరేట్ ఏకఛత్రాధిపత్యంపై కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇది ప్రమాద ఘంటికలు మోగిస్తున్నదని హెచ్చరించారు. ఇటీవల నెలకొన్న ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభాన్ని ఉదహరించారు. ఇండిగోలో ఏర్పడ్డ సమస్యలతో ఐదు రోజుల్లో వెయ్యి విమానాలు రద్దయ్యాయని, విమానాశ్రయాలు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లను తలపించాయని గుర్తుచేశారు. ఇండిగో, ఎయిరిండియా సంస్థలకు విమానయానంలో గుత్తాధిపత్యం కట్టబెట్టడం, కేంద్రం తెచ్చిన ఏవియేషన్ సంస్కరణలే ఇందుకు కారణమని సూత్రీకరించారు. చివరకు కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చి సంస్కరణలను వెనక్కితీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించారు. ప్రస్తుతం కేంద్రం లేబర్కోడ్లు అమల్లోకి వస్తే ఇలాంటి అనర్థాలే తలెత్తుయాయని, ఈ అరాచకం అన్ని రంగాలకు విస్తరిస్తుందని హెచ్చరించారు.
లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కారును అడ్డుకొనేందుకు వరంగల్ నుంచే ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రారంభించే ఉద్యమం దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని చెప్పారు. ఉమ్మడి జిల్లాలవారీగా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు. బీఆర్టీయూ ఆధ్వర్యంలో కలిసివచ్చే ట్రేడ్ యూనియన్లతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి లేబర్కోడ్లపై అవగాహన కల్పించాలని పార్టీ నేతలు, కార్మిక యూనియన్ బాధ్యులకు సూచించారు. హైదరాబాద్ పరిధితో పాటు అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందించాలని కోరారు. పార్టీపరంగా ప్రభుత్వానికి లేఖలు రాస్తామని, సాధ్యమైతే రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు పెడతామని పేర్కొన్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు, కేంద్ర కార్మిక శాఖ మంత్రిని కలిసి వినతిపత్రాలు అందజేస్తామని ప్రకటించారు. లేబర్కోర్టుల్లో జడ్జిలను నియమించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు, చీఫ్ జస్టిస్‌ను కలుస్తామని పేర్కొన్నారు.
అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ మార్గం ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని పేర్కొన్నారు. ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తుచేశారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని స్పష్టంచేశారు.
గిరిపుత్రుల అభ్యున్నతికి కేసీఆర్ తన పదేండ్ల పాలనాకాలంలో చేసిన సేవలు చిరస్మరణీయమని కేటీఆర్ కొనియాడారు. తండాలు, గూడేలను పంచాయతీలుగా చేసిన ఘనత ఆయనకే దక్కిందని గుర్తుచేశారు. శనివారం హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనూ నాయక్ రచించిన గిరిజనుల ఆత్మబంధువు పుస్తకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పెరిగిన జనాభాకు అనుగుణంగా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని చెప్పారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వడమే కాకుండా రైతుబంధు పథకాన్ని వర్తింపజేసిన విషయాన్ని ప్రస్తావించారు. గిరిజన విద్యార్థుల కోసం గురుకులాలు, సీఎంఎస్టీఈఐ స్కీం, గిరివికాస్, గిరి పోషణ పథకాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్‌లో కుమ్రం భీం పేరిట ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించారని పేర్కొన్నారు. ఇలా అనేక సంక్షేమ పథకాలతో గిరిజనుల కలలను సాకారం చేసిన కేసీఆర్‌ను గిరిజనులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించారు.
గిరిజన తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చిన రోజు ఆగస్టు 2న నూతన పంచాయతీల్లో సంబురాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గిరిజనుల అభ్యున్నతి కోసం కేసీఆర్ చేసిన సేవలను పుస్తకరూపంలోకి తీసుకువచ్చిన శ్రీనూనాయక్ను అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.