హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఫొటోలు ఏఐ రూపొందించిన చిత్రాలని, ఇలాంటి వాటిని వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై అసత్య ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏఐ రూపొందించిన ఫేక్ ఫొటోలు, వీడియోలను ఉపయోగిస్తున్నాయని ధ్వజమెత్తారు.
ఈ నకిలీ ఫొటోలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని, వాటిని రూపొందించిన, ప్రచారం చేసిన వ్యక్తులతో పాటు వాటిని ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేసిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. ఏఐ ద్వారా రూపొందించిన ఫొటోలు, వీడియోలను నిజమైనవిగా ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను బీఆర్ఎస్ సహించబోదని ఆయన స్పష్టంచేశారు.
నకిలీ చిత్రాలు, కల్పిత కథనాలు ప్రచారం చేయడం ద్వారా అసలు విషయాన్ని ప కదారి పట్టించే ప్రయత్నం జరుగుతున్నదని విమర్శించారు. ‘దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది’ అని ఆయన విమర్శించారు.