రుద్రంగి, సెప్టెంబర్ 9 : ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో రైతులు అరిగోస పడుతున్నారు. దాదాపు మూడేండ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు వానలు లేక.. మరోవైపు నాణ్యమైన కరెంటు రాక నరకం అనుభవిస్తున్నారు. బోర్లలో నీరున్నా.. విద్యుత్తు లేక పంటలకు నీరందక పొలాలు ఎండిపోతున్నాయని కన్నీరు పెడుతున్నారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రైతు గెంట మల్లయ్య తనకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు.
ఒక బాయి, బోరు సహాయంతో పండిస్తున్నాడు. నిత్యం కరెంటు కోతలతో కేవలం మూడు ఎకరాలకే సాగునీరు అందుతున్నదని, మరో రెండెకరాలకు నీరందక పంట ఎండిపోతున్నదని ఆవేదన చెందాడు. కోతలతో ఇప్పటికే మూడుసార్లు బోరు కాలిపోయిందని, దాదాపు రూ.30 వేలు ఖర్చుచేసినట్టు వాపోయాడు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు 12 గంటల కరెంటు ఉన్నా.. మాటిమాటికి కరెంటు పోతున్నదని, దీంతో బోర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశాడు. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడాల్సివస్తుందని కంటతడి పెడుతున్నాడు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, స్థానిక నాయకులు చొరవ తీసుకొని నాణ్యమైన విద్యుత్తు అందించాలని కోరుతున్నాడు.