న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ(సీసీపీఏ) గట్టి షాకిచ్చింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్ సంస్థలపై భారీ జరిమానాలు విధించింది. నమోదుకాని క్రిమి సంహారక మందులను విక్రయించినందుకుగాను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించిన సీసీపీఏ..జియోమార్ట్‌పై రూ.5 లక్షల చొప్పున విధించింది.
ఆయా సంస్థలు సైక్లోసినోన్ హెర్బిసైడ్ అనే నమోదుకాని వ్యవసాయ రసాయన ఉత్పత్తిని విక్రయించడంంతోపాటు ప్రచారం చేసినందుకుగాను ఈ జరిమానా విధించినట్టు సీసీపీఏ పేర్కొన్నది. వెంటనే ఈ మూడు సంస్థలు ఆ ఉత్పత్తి అమ్మకాలు, ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్పత్తిలో క్రియాశీలక పదార్థం రసాయన నామాన్ని లేదా దాని కూర్పును వెల్లడించకుండానే విక్రయిస్తున్నట్టు గుర్తించింది.