హైదరాబాద్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): 22ఏ జాబితాలో ఉన్న లేఅవుట్లలోని ఓపెన్ ప్లాట్లు, ఇండ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కీలక వెసులుబాటు కల్పిస్తూ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. తాజా నిర్ణయం ప్రకారం.. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ , డీటీసీపీ లేదా స్థానిక సంస్థల నుంచి చట్టబద్ధమైన లేఅవుట్ లేక భవన నిర్మాణ అనుమతులు పొందిన ఆస్తులకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నది.
సంబంధిత ప్ర ణాళికా విభాగాల నుంచి అనుమతులు లభించిన అనంతరం జరిగిన రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్లను దరఖాస్తుదారులు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం న్యాయస్థానాల్లో వివాదాలు నడుస్తున్న లేదా పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు మాత్రం పూర్తిగా కోర్టుల తుది తీర్పులకు లోబడి ఉంటాయని రెవెన్యూశాఖ స్పష్టంచేసింది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తలెత్తే వి వాదాలు, సమస్యలను వేగవంతంగా పరిషరించేందుకు జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కలెక్టర్ అధ్యక్షతన కొనసాగే ఈ కమిటీలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), జిల్లా రిజిస్ట్రార్, సంబంధిత స్థానిక సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.