కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 9 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని, నిషేదిత భూముల జాబితా నుంచి ప్రజల ఆస్తులను తొలగించాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం సిగ్గుచేటని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అవుతున్నదని, వంద రోజుల్లోనే హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పి, నేటికి ఆ హామీలను అమలు చేయకపోవడం బాధకరమన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలపై పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను శాసనసభలోకి రాకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ చేత అనుచిత వ్యాఖ్యలు చేయించి, కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంపై కాంగ్రెస్ గుండాలతో దాడులు చేయించి రాక్షసానందం పొందారన్నారు. మూడో రోజు అసెంబ్లీలో 22ఏ పై మాట్లాడేందుకుకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారన్నారు.
దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అరాచకాన్ని సృష్టిస్తుందన్నారు. ప్రజా సమస్యలను సభ దృష్టికి రాకుండా ఏకపక్షంగా ఎమ్మెల్యేల హక్కులను హరిస్తున్నదన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. దేశంలో ఒకరిపై మరొకరు పోరాడుతూ..రాష్ట్రంలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లోపాయకారి ఒప్పందాలతో బీఆర్ఎస్ను ఇబ్బంది పెడుతున్నాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకొని బీఆర్ఎస్పై విమర్శలు చేయడం సిగ్గచేటన్నారు.