KTR | కరీంనగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం జలాల పంపింగ్ ప్రక్రియను ఆగస్టు 2లోగా ప్రారంభించకపోతే.. 50 వేల మంది రైతులతో వచ్చి మోటర్లు ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వార్నింగ్‌కు రేవంత్ సర్కారు తలవంచింది. అల్టిమేటం ఇచ్చిన 24 గంటల్లోనే కాంగ్రెస్ సర్కారు ఆగమేఘాల మీద పంపులను ఆన్ చేసింది. ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు (శ్రీ రాజరాజేశ్వర) ప్రాజెక్టుకు శనివారం ఎత్తిపోతలను ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇదే పంపుల ద్వారా నీళ్లను ఎత్తిపోసిన ప్రభుత్వం.. మళ్లీ నాలుగు నెలల తర్వాత బహుబలి మోటర్లు ఆన్ చేసింది. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
సర్కారుకు కేటీఆర్ వార్నింగ్
సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎత్తిపోసి.. ఎగువన ప్రాజెక్టులను నింపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25, 26 తేదీల్లో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం ప్రాజెక్టులను సందర్శించింది. 25న లోయర్‌మానేరు డ్యాం ప్రాజెక్టును, 26న మేడిగడ్డ ప్రాజెక్టుతోపాటు లక్ష్మి (కన్నెపల్లి) పంప్‌హౌస్‌ను సందర్శించింది. ఆ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ నుంచి నీటిని పంపింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే ఆగస్టు 2లోగా ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామని, అప్పటికీ నీటిని పంపింగ్ చేయకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి తామే ప్రారంభిస్తామని హెచ్చరించారు.
దిగొచ్చిన సర్కారు
కేటీఆర్ అల్టిమేటం ఇచ్చిన 24 గంటల్లోనే కాంగ్రెస్ సర్కారు ఎత్తిపోతలను ప్రారంభించింది. నిజానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఈ ఎత్తిపోతలను నాలుగైదు రోజుల ముందు నుంచే ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నది. అధికారులు కూడా అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ, కాంగ్రెస్ సర్కారు మాత్రం పైపులు ఆన్ చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందన్న ఉద్దేశంతో నాన్చివేత ధోరణి అవలంబించింది. ఈ తరుణంలో కేటీఆర్ డెడ్‌లైన్ విధించారు. దీంతో ఎత్తిపోతలు ప్రారంభించకుంటే వేల మంది రైతులు తరలివచ్చి కేటీఆర్‌కు అండగా నిలుస్తారని, తమ కు చెడ్డ పేరొస్తుందని భావించి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అందులో భాగంగానే.. శనివారం నుంచి ఎత్తిపోతల కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుతం కాళేశ్వరం లింకు-2 కింద మోటర్లు ఆన్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మధ్యమానేరుకు ఎత్తిపోతలను ప్రారంభించింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంపుహౌస్‌లో 4 మోట ర్లు అన్ చేశారు. ఒక్కో మోటరు ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం 12,600 క్యూసెక్కులను ఎత్తిపోస్తూ కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయ త్రి పంపుహౌస్‌కు తరలిస్తున్నారు. ఇక్కడ నాలుగు బహుబలి మోటర్లు ఆన్ చేసి, వచ్చిన నీటిని వచ్చినట్టు ఎత్తి వరదకాలువ ద్వారా మధ్యమానేరు ప్రాజెక్టుకు పంపిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న మోటర్ల ప్రకారం చూస్తే.. రోజుకు 1.2 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్నారు. నందిమేడారం, గాయత్రి పంపుహౌస్ వద్ద 7 మోటర్లు ఉండగా, మొత్తం పంపులను ఆన్‌చేస్తే రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చు.
కన్నెపల్లే కరెక్ట్
ఈ సీజన్లో మేడిగడ్డ నుంచి దాదాపు 540 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. మేడిగడ్డ వద్ద ఉన్న లక్ష్మి (కన్నెపల్లి) పంపుహౌస్ నుంచి ముందుగానే ఎత్తిపోతలు ప్రారంభించి ఉంటే ఈ పాటికి ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులను నింపుకునే ఆస్కారం ఉండేది. అంతేకాదు, శనివారం సాయంత్రం చూస్తే మేడిగడ్డ వద్ద 5,39,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నది. అంటే దాదాపు రోజుకు 50 టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు చెప్పారని, అందుకే తాము లక్ష్మీ పంపుహౌస్ నుంచినీటిని ఎత్తిపోసేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వాదిస్తున్నది. దీని ద్వారా వందల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి తప్ప.. తెలంగాణ రైతులకు ఉపయోగం లేకుండా పోతున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.3969 టీంఎసీల నీరు ఉన్నది. ఇన్ ఫ్లో 12,931 క్యూసెక్కులు మాత్రమే ఉన్నది.
నిజానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలు, కరెంటు అవసరాల నిమిత్తం దాదాపు పది టీఎంసీలను ఉంచాల్సి ఉంటుంది. ఇన్‌ఫ్లో తగ్గితే ఈ ప్రాజెక్టు నుంచి నాలుగైదు టీఎంసీలకన్నా ఎక్కువ ఎత్తిపోయడానికి వీలుండదు. అదే జరిగితే మళ్లీ ఎగువన ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ఎండమావే అవుతుంది. మధ్యమానేరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 27.54 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 6.87 టీంఎసీలు మాత్రమే ఉన్నాయి. లోయర్‌మానేరు డ్యాం, అన్నపూర్ణ జలాశయం, ఎగువమానేరు, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు నింపుకోవాలంటే.. దాదాపు 150 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయి. దీనికి ఎస్సారెస్పీ ప్రాజెక్టుని కలుపుకుంటే దాదాపు 200కు పైగా టీఎంసీల వరకు నీళ్లు అవసరం పడుతాయి. వీటిని నింపుకోవాలంటే కన్నెపల్లి పంపుహౌస్ ఆన్ చేయడం తప్ప మరోమార్గం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాడు కేసీఆర్ గర్జన
పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ సర్కారు నీటి విడుదలపై ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. నీటిని విడుదల చేయాలని వరదకాలువ నీటి పరీవాహక ప్రాంత రైతులు మార్చి, ఏప్రిల్‌లో ఆందోళనలు చేశారు. అప్పుడు వారికి కేసీఆర్ అండగా నిలిచారు. పంటలు ఎండిపోతున్నా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయలేదు. దీంతో గత పదేండ్లలో ఎన్నడూలేని విధంగా వరద కాలువ అడుగంటింది. కాలువలో క్రేన్లు బిగించి రైతులు కాలువలో గుంతలు తవ్వుకుని నీటిని పంటలకు తరలించే ప్రయత్నాలు చేశారు. తమ పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ అనేక సార్లు ఆందోళనకు దిగారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంగాధర, రామడుగు, బోయినపల్లి, మల్యాల మండలాల రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.
కరీంనగర్, జగిత్యాల రహదారిపై పలుసార్లు రాస్తారోకోలు చేశారు. ప్రభుత్వం మాట వినకపోవటంతో కేసీఆర్ గర్జించారు. వెంటనే రైతులను ఆదుకోవాలని సర్కారును హెచ్చరించారు. దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మార్చి చివరలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు ప్రారంభించింది. రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్‌కు నీటిని ఎత్తిపోశారు. అక్కడి నుంచి 6వ బాహుబలి మోటర్ ద్వారా వరద కాలువలోకి ఎత్తి పోశారు. వరద కాలువ ఎగువ ప్రాంతంలోని 122వ కిలోమీటర్ వద్ద గేట్లు మూసివేయటంతో.. అటు ఎస్సారెస్పీకి వెళ్లకుండా దిగువ ప్రాంతానికి నీటిని మళ్లించారు. తద్వారా రైతులకు కొంత మేలు చేకూరింది.