KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి అంత దౌర్భాగ్యపు, చరిత్రహీన ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. పోలీసులతో ఎసార్ట్ ఇచ్చి ఒక ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పంపుతారా? ఇదెకడి దుష్ట సంప్రదాయమని ప్రశ్నించారు. కేటీఆర్ శనివారం మాదాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు. దాడిలో పగిలిన ఇంటి అద్దాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గాంధీ అనుచరులు కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనల కారణంగా జరగరానిది జరిగితే సీఎం బాధ్యత తీసుకుంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గాంధీని హౌస్ అరెస్ట్ చేయకుండా పోలీసులతో ఎసార్ట్ ఇచ్చారని మండిపడ్డారు. గాంధీ రోడ్డుపై ఫ్యాక్షన్ లీడర్‌లాగా వస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారని నిలదీశారు.
ఇదంతా రేవంత్ ఆడిన డ్రామా అని ఆరోపించారు. ఈ రకమైన గూండాగిరి హైదరాబాద్‌లో పదేండ్లలో ఎప్పుడూ లేదని, చేతగాని హోం మంత్రి, ముఖ్యమంత్రి కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను కాపాడలేని రేవంత్‌కు సీఎంగా ఉండే అర్హత ఉన్నదా? అని ప్రశ్నించారు. ‘ఈ నగరానికి ఏమైందంటూ పేపర్లు రాస్తున్నాయి. నెలలో 28 మర్డర్లు అయినట్టు వార్తలొచ్చాయి. హోం మంత్రి ఎవరో తెలియదు. హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ కాపాడలేని ముఖ్యమంత్రి రేవంత్’ అని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో లెవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేక చిల్లర ఎత్తుగడలు, చిల్లరమాటలు, బజారుమాటలతో రాజకీయాలను దిగజారుస్తున్నారని దుయ్యబట్టారు.
హైకోర్టు తీర్పుతో ఆ ఎమ్మెల్యేల్లో వణుకు
పార్టీ ఫిరాయింపులపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో వణుకు పుట్టిందని, అందుకే తాము పార్టీ మారలేదంటూ కొత్త రాగం ఎత్తుకున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్కు చెందిన పది మంది ఎమ్మెల్యేల ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లి, వారిని బతిమిలాడి, కాళ్లుమొక్కి కండువా కప్పుతున్నారని, ఒక్కొక్కరిని ఒక్కోరకంగా ప్రలోభ పెట్టి, బెదిరింపులతో పార్టీ మారేలా ఒత్తిడి చేశారని ఆరోపించారు. హైకోర్టు తీర్పు తరువాత వేటు తప్పదని గ్రహించి, తాము పార్టీ మారలేదంటూ స్వరం మార్చారని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ విధానాలు నచ్చి పార్టీలో చేరానని చెప్పి, ఇప్పుడెమో బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై కోర్టులో కేసు నడిపినందునే కౌశిక్‌రెడ్డిపై కోపం పెంచుకున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల పదవులు ఊడటం ఖాయమని చెప్పారు. హైకోర్టు తీర్పు ఇచ్చినరోజే సభా సంప్రదాయాలు, రాజ్యాంగ విలువలు, పార్లమెంటరీ పద్ధతులను తుంగలోతొకి గాంధీని పీఏసీ చైర్మన్‌గా ఎన్నుకోవడం కాంగ్రెస్ నీతిమాలిన విధానానికి నిదర్శనమని మండిపడ్డారు.
బుల్లబ్బాయి, చిట్టి నాయుడు.. రేవంత్‌కు కొత్త పేర్లు
చేతగాని సీఎం ఉండటం వల్లనే ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగిందని కేటీఆర్ విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డి.. నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉన్నదా? నీలాంటి పనికిమాలిన, తలమాసిన సీఎంలను ఏనాడూ చూడలేదు. చంద్రబాబు, వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటివాళ్లతో తలపడ్డాం. వాళ్లందరి కంటే చిన్నోడివి. హైదరాబాద్‌లో నీలాంటి వారిని బుల్లబ్బాయి, చిట్టినాయుడు అని అంటారు. అధికారం ఎవరిరీ శాశ్వతం కాదు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘గాంధీ.. ఏ పార్టీలో ఉన్నావు?’ అని నిలదీశారు. కౌశిక్‌రెడ్డి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఎస్ఐ, ఏసీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ఎన్నిరకాల డైవర్షన్ గేమ్‌లు అడినా, హెడ్లైన్ మేనేజ్మెంట్లు చేసినా.. ఆరు గ్యారెంటీలు, రుణమాఫీపై ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టంచేశారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం
బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మీద దాడులు చేయిస్తున్నది ముఖ్యమంత్రేనని కేటీఆర్ ఆరోపించారు. ఏ కార్యకర్తకు ఏ చిన్న హాని జరిగినా పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హరీశ్‌రావు సహా పలువురు నేతలను మొన్న పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో బీఆర్ఎస్ బలగం పవరేమిటో చూపించారని చెప్పారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి చుకలు చూపించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, మాధవరం కృష్ణారావు, అనిల్‌జాదవ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గణేశ్‌గుప్తా, బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కే వాసుదేవరెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి, పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాదీలంతా మా వాళ్లే
గత పదేండ్లలో ఏనాడూ ప్రాంతీయ తత్వంతో తాము దాడులు జరపలేదని, అభివృద్ధి, సంక్షేమం మీదనే దృష్టిపెట్టామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రజలంతా తమ వాళ్లేనని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు తమను ఆశీర్వదించారని, కానీ, రేవంత్ పనికిమాలిన వ్యక్తి అనుకొని ఇక్కడి ప్రజలు ఆయనకు ఒక సీటు కూడా ఇవ్వలేదని చెప్పారు. అందుకే హైదరాబాద్ ప్రజలపై రేవంత్‌రెడ్డి విద్వేషం నింపుకొని, పగబట్టారని, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
దమ్ముంటే రాజీనామా చేయండి
‘పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయండి.. ప్రజాక్షేత్రంలోకి రండి.. రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీకి దమ్ముంటే వారితో రాజీనామా చేయించాలి’ అని కేటీఆర్ సవాలు చేశారు. రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులపై ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని సూచించారు. ‘రాళ్లతో కొట్టి చంపండి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇంటి ముందట చావు డప్పు కొట్టిస్తాం. వారిని ఉరితీయాలి’ అంటూ రేవంత్ మాట్లాడారని చెప్పారు.