హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరామర్శించారు. శనివారం ఉదయం అమెరికా పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పార్టీ నాయకులతో కలిసి గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు వెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్న్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. త్వరలోనే మాగంటి గోపీనాథ్ కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
కాగా, గత గురువారం మాగంటి గోపీనాథ్ గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి హాస్పిటల్లోనే చికిత్స అందిస్తున్నారు. కార్డియాక్ అరెస్టు కావడం.. సీపీఆర్‌తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. ఇంకా అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. కొంత సమయం గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తున్నదని చెప్పారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, రవీందర్ రావు, నాయకులు మాలోతు కవిత, రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు.