గుల్జార్‌హౌస్ ప్రమాదం హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. బాధితులు తమ బాధను చెప్తూ.. ‘రెండున్నరేండ్ల చిన్నారిని అక్కడ సమాధి చేసి వచ్చినం.. ఇంతకంటే మా జీవితంలో దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటదా? మేము బతికి లాభమేంది’ అని కన్నీళ్లు పెట్టుకుంటున్నరు. ఫైరింజన్లో నీళ్లు, అంబులెన్స్‌లో ఆక్సిజన్ ఉంటే ప్రాణనష్టం తగ్గి ఉండేదంటున్నరు. రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ.. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, పౌరసేవల నిర్వహణపై పెడితే బాగుంటది.
-కేటీఆర్
KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ) : అగ్ని ప్రమాదంలో 17 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోవడం అత్యంత బాధాకరమని, మనసున్న ఎవరికైనా గుండె తరుక్కుపోతుందని, హైదరాబాద్ చరిత్రలోనే ఇది దురదృష్టకరమైన రోజు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఫైరింజన్లు, ఆంబులెన్స్‌లలో సరైన సౌకర్యాలు ఉండి ఉంటే ఈ ఘటనలో ప్రాణనష్టం తగ్గి ఉండేదని అభిప్రాయపడ్డారు. గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం విషయంలో బాధిత కుటుంబసభ్యులు ఎవరినీ నిందించడం లేదని, వారు కొన్ని విషయాలు చెప్పారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందాల పోటీల మీదనే ధ్యాసనా?.. బాధితుల ఆర్తనాదాలు పట్టవా? అని ప్రశ్నించారు.పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగిన భవనాన్ని మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి కేటీఆర్ సోమవారం పరిశీలించారు.
రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్‌పల్లి గౌతమ్నగర్కు చెందిన ఒకే కుటుంబం వారు అగ్నిప్రమాదంలో చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మొదట శ్రీకృష్ణ పెరల్స్ షాపు వద్ద ప్రమాదం జరిగిన తీరును, అక్కడి పరిస్థితులపై అధికారులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మంటల్లో మసైన ఉపకరణాలను చూసి ఆయన అగ్నికీలల తీవ్రతపై విస్తుపోయారు. అనంతరం ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా అగర్వాల్ కుటుంబానికి చెందిన బాధితులు కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతూ అగర్వాల్ కుటుంబంలో 17 మంది చనిపోవడం విషాదకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఫైర్ బ్రిగేడ్‌లో నీళ్లు సరిగ్గా లేవని, ఫైర్ సిబ్బందికి సరైన మాస్కులు కూడా లేకపోవడంతో వారు లోపలికి వెళ్లి బాధితులను కాపాడలేకపోయారని వాపోయారు. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రజల ప్రాణాలు మరోసారి ప్రమాదంలో పడే అవకాశమున్నదని, ఇప్పటికైనా మేల్కోవాలని సూచించారు.
తాను రాజకీయం చేయడానికి ఇక్కడికి రాలేదని, ఎవరినీ విమర్శించడం లేదని, ఇలాంటి కడుపుకోత ఇంకెవరికీ రాకూడదని వచ్చానని కేటీఆర్ స్పష్టంచేశారు. ఎండకాలం వచ్చిందంటే మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణ, ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం పెట్టుకోవాలని సూచించారు. సిబ్బందికి నిరంతరం శిక్షణ ఇవ్వాలని, తరచూ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని చెప్పారు. ఇవేవీ జరగకపోవడం, సరైన సదుపాయాలు లేకపోవడం వల్లే ఇంత ప్రాణనష్టం జరిగిందని, ఎనిమిది మంది చిన్నారులు తమ కండ్ల ముందే చనిపోయారని బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పాతబస్తీ అధిక జనసాంద్రత కలిగిన, ఇరుకైన ప్రాంతం కావడంతో ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్‌లు, ఫైరింజన్లు రావడానికి వీలు కాదని, ప్రాణాలు పోయిన తర్వాత నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌కీ నిషానీ చార్మినార్ వద్దకు అందాల పోటీల కంటెస్టెంట్లను తీసుకురావడంపై, పోటీలకు ఖర్చు పెట్టడంపై ఉన్న శ్రద్ధ, రాష్ట్రంలోని మారుమూల పల్లెల్లోనూ ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే సహాయక చర్యలు అందేలా కల్పించాల్సిన సౌకర్యాలపై పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. హోం, అగ్నిమాపక శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయని, ఘటనా స్థలం దగ్గరకు రేవంత్‌రెడ్డి వస్తే బాగుండేదని, అధికారులు మరింత అప్రమత్తమయ్యేవారని చెప్పారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం సరిపోదని, వారి ఇంటికి, వ్యాపారానికి తీవ్రనష్టం జరిగిందని తెలిపారు. అగర్వాల్ కుటుంబం మళ్లీ వ్యాపారాన్ని ప్రారంభించుకొనేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. బాధిత కుటుంబాలకు రూ. రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తరఫున కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తామని, ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని సూచించారు.