హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): మలి దశ తెలంగాణ ఉద్యమంలో యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన బీఆర్ఎస్ నాయకుడు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలంను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పరామర్శించారు. అనిల్ కూర్మాచలం ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకుని, కోలుకుంటున్నారు. యూకే, యూఎస్ పర్యటనలో భాగంగా మంగళవారం లండన్ చేరుకున్న కేటీఆర్.. ఎయిర్పోర్టు నుంచి నేరుగా అనిల్ కూర్మాచలం ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనను ఎంతో అప్యాయంగా పలకరించి, ఆరోగ్యస్థితిపై వాకబు చేశారు. తన కుటుంబసభ్యులతో మాట్లాడి, వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తనను పరామర్శించడానికి వచ్చిన కేటీఆర్కు అనిల్ కూర్మాచలం ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తు తం తన ఆరోగ్యం బాగానే ఉన్నదని చెప్పారు.