రాజన్న సిరిసిల్ల, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ‘ఒకప్పుడు తెలంగాణ పల్లెలంటే పాడుబడ్డ బావులు, పాత గోడలు, చెత్త కుప్పలు, మట్టి దిబ్బ లు. తెలంగాణ వచ్చినంక పల్లె ముఖచిత్రమే మారిపోయింది. తెలంగాణ బిడ్డలు గర్వపడేలా పల్లెల అభివృద్ధి జరిగింది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ దర్జాగా కాలర్ ఎగిరేసిందంటే సర్పంచుల పనితీరు వల్లేనని కొనియాడారు. నాడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడిన పల్లెలను, నేడు సకల సౌకర్యాల హరివిల్లులుగా మార్చిన ఘనత మనదేనని పేర్కొన్నారు. మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్‌తో కలిసి కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల జిల్లా లో పర్యటించారు. రగుడు వద్ద తెలంగాణ భవన్లో నిర్వహించిన సర్పంచుల ఆత్మీయ సత్కారానికి హాజరై మాట్లాడారు. ‘రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన సర్పంచులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో 2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణకు 81 అవార్డులు వచ్చినట్టు కేటీఆర్ తెలిపారు. దేశంలో 3 శాతం కన్నా తక్కువ జనాభా ఉన్న తెలంగాణకు జాతీయ స్థాయిలో 35 శాతం అవార్డులు రావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో టాప్‌టెన్‌లో పదికి పది అవార్డులు, ఇరవైలో 19 అవార్డులు తెలంగాణకే దక్కడం సర్పంచుల పనితీరుకు నిదర్శమని పేర్కొన్నారు.
పదవులు శాశ్వతం కాదని, చేసిన పనులతో మన పేరు సమాజంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతుందని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన సర్పంచులు అదృష్టవంతులని కొనియాడారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పాల్గొన్నారు.
చందుర్తి, జనవరి 16: జీవితమైనా, రాజకీయమైనా ఎదురు దెబ్బలు సహజమని కేటీఆర్ పేర్కొన్నారు. చందుర్తి మండలం మల్యాలలో కేసీఆర్ కప్ వాలీబాల్ టోర్నీని ప్రారంభించి, మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు సమానంగా స్వీకరించే సత్తా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఈర్లపల్లి నారాయణ కేటీఆర్‌ను చూసి భావోద్వేగానికి లోనై ‘నాన్న ఎలా ఉన్నా రు?’ అని అడిగి కన్నీటి పర్యంతం కాగా, కేటీఆర్ ఓదార్చారు.