బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్‌లుగా గెలిచిన గ్రామాలకు నిధులివ్వబోమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నరు. పంచాయతీలకు నిధులు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకపోవడం వాళ్ల సొత్తేం కాదు. అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగబద్ధమైన హక్కు. రేవంత్‌రెడ్డి ఏమైనా తన భూములమ్మి గ్రామాలకు ఇస్తున్నడా?
-కేటీఆర్

KTR | హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ప్రజల సొమ్ముకు కేవలం ధర్మకర్తలు మాత్రమేనని, బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ల గ్రామాలకు నిధులు ఇవ్వమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని, పంచాయతీలకు నిధులు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకపోవడం వాళ్ల సొత్తేం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెకిందని, ప్రజలను, ప్రజాప్రతినిధులను చంపేస్తామని బహిరంగంగా బరితెగించి బెదిరిస్తున్నారని విరుచుకుపడ్డారు. సర్పంచ్‌లకు నిధులు అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగబద్ధమైన హక్కు అని, రేవంత్‌రెడ్డి ఏమైనా తన భూములు అమ్మి గ్రామాలకు ఇస్తున్నాడా? అని ప్రశ్నించారు.
ఎవరైనా నిధులివ్వకుండా అడ్డుతగిలితే తాటతీసి లైన్లో పెట్టాలని పిలుపునిచ్చారు. ఖానాపూర్, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా గెలిచిన వారిని తెలంగాణభవన్‌లో కేటీఆర్ మంగళవారం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన పలువురు సర్పంచ్‌లు బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో 2.80 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేస్తే, కేవలం రెండేండ్లలోనే కాంగ్రెస్ సర్కారు రూ.2.88 లక్షల కోట్ల అప్పులు చేసిందని మండిపడ్డారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేండ్లే. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీరు ఐదేండ్ల కోసం గెలిచిండ్రు. మిగిలిన సగం కాలం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు చేసుకుంటరు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఐకమత్యంతో కలిసి పనిచేయాలి.
– కేటీఆర్

కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నరు. ఒక ఎమ్మెల్యే అయితే ‘బీఆర్ఎస్ సర్పంచ్‌లను నేనే చంపేస్తా’ అని బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నడు. ఎమ్మెల్యేల ప్రవర్తన చూసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గ్రామాల్లో అరాచకాలు చేస్తున్నరు. సర్పంచ్‌లు ఎవరూ బెదిరింపులకు లొంగవద్దు. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకపోవడానికి ఈ ఎమ్మెల్యేలు ఎవరు?’ అని ప్రశ్నించారు. అధికార ఎమ్మెల్యేల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ‘గ్రామాల్లో ఏం చేయాలన్నా గ్రామసభ తీర్మానం ఉండాల్సిందే. ప్రజల పైసలతో కడుతున్న ఇందిరమ్మ ఇండ్లకు అర్హులను ఎంపిక చేసే పూర్తి అధికారం గ్రామ సభలకు, సర్పంచ్‌లకే ఉంటుంది. ఎవరైనా అడ్డుతగిలితే తాట తీసి లైన్లో పెట్టండి’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఎవరి భిక్షా కాదని కేటీఆర్ స్పష్టంచేశారు. బాబాసాహెబ్ అంబేదర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఐదంచెల పాలనలో పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి ఉన్నదని గుర్తుచేశారు. గ్రామ స్థాయిలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మండలస్థాయిలో ఎంపీటీసీలు, జిల్లాస్థాయిలో జడ్పీటీసీలు, రాష్ట్రస్థాయిలో ఎమ్మెల్యేలు, దేశస్థాయిలో పార్లమెంట్ సభ్యులు ఉంటారని, ఆయా వ్యవస్థల మధ్య సమన్వయం కోసం ఐదంచెల పాలనను రాజ్యాంగంలో పెట్టారని గుర్తుచేశారు. గ్రామ పాలన, అభివృద్ధిలో గ్రామసభ కీలకమని చెప్పారు. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన నిధులను ఆపే హకు ఏ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు లేదని స్పష్టంచేశారు, ‘మీ హకుల కోసం కొట్లాడండి.. బీఆర్ఎస్ మీకు అండగా ఉంటది’ అని భరోసా ఇచ్చారు. ఇందుకు జిల్లాకో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన రూ.3,500 కోట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి, రిజర్వేషన్లు 24 శాతం నుంచి 17 శాతానికి తగ్గించి హడావుడిగా ఎన్నికలు జరిపింది. ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో 70 శాతం నేరుగా పంచాయతీలకే రావాలి. ఆ నిధులను ఆపే హకు ఏ ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు లేదు.
– కేటీఆర్
రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొట్లాటలు కనిపించకుండా రేవంత్‌రెడ్డి సర్కారు యాప్ విధానం ప్రవేశపెట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. ‘షాపుల్లో అమ్మాల్సిన యూరియాను యాప్‌లో అమ్ముతారట’ అని ఎద్దేవాచేశారు. ‘రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడి బాధలు పడుతున్నరు. చెప్పుల లైన్లు కనపడితే ప్రభుత్వం పరువు పోతదని ముఖ్యమంత్రి తెలివిగా యూరియా యాప్ సీమ్ తెచ్చిండ్రు. షాపులో దొరకని యూరియా యాప్‌లో దొరుకుతుందా?’ అని నిలదీశారు. ‘కేసీఆర్ హయాంలో ప్రతి గ్రామానికీ ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ, వైకుంఠధామం వచ్చినయ్. తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచి 30 శాతం జాతీయ అవార్డులు గెలుచుకున్నయ్. కానీ, నేడు పరిస్థితి దారుణంగా తయారైంది. ట్రాక్టర్లకు డీజిల్ పోయించే దికులేదు. మేము మొక్కలు నాటితే వీళ్లు చెట్లను నరికేస్తున్నరు’ అని విమర్శించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులు దికులేక ప్రపంచబ్యాంకుకు ఉత్తరాలు రాస్తున్నరు. అలాంటిది సర్పంచ్‌లకు ఏమిస్తరు? రెండేండ్లలో రూపాయి కూడా పంచాయతీలకివ్వని కాంగ్రెస్ సర్కారు, ఇప్పుడు మాత్రం ఎలా ఇస్తది?
– కేటీఆర్

సర్పంచ్ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేయడం చరిత్రలో ఎన్నడూ లేదని కేటీఆర్ విమర్శించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ వంటి నాయకులు ఏనాడూ సర్పంచ్ ఎన్నికల కోసం రోడ్ల మీద పడలేదని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే విజయోత్సవాల పేరుతో పరోక్షంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేండ్లే. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీరు ఐదేండ్ల కోసం గెలిచారు. మిగిలిన సగం కాలం మన ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు చేసుకుంటారు’ అని చెప్పారు. ‘ఖానాపూర్, షాద్‌నగర్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయం’ అని ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఐకమత్యంతో కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్న చోట వివిధ పదవుల్లో వారికి అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, దాస్యం వినయ్‌భాస్కర్, షకీల్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్చార్జి జాన్సన్‌నాయక్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.