వరంగల్ : చారిత్రక నేపథ్యం ఉన్న ఓరుగల్లుకు భద్రకాళి బండ్ మరో మనిహారంగా మారుతోందని ఆనందం వ్యక్తం చేశారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రూ.2కోట్ల 10 లక్షలతో నిర్మించిన 570 మీటర్ల పొడవైన భద్రకాళి మినీబండ్ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..వరంగల్ అంటేనే భద్రకాళి గుడి..భద్రకాళి గుడి అంటేనే వరంగల్ అనే అభిప్రాయం ఉంటుందని, అలాంటి భద్రకాళి గుడికి కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సుందరంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీయార్ దేనని కొనియాడారు. దేశ, విదేశాలనుంచి వచ్చే భక్తులు, పర్యాటకులను సైతం ఆకట్టుకునేలా భద్రకాళి బండ్ ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.
20న వరంగల్లో మంత్రి కేటీఆర్ పర్యటన..
కాగా, ఈ నెల 20వ తేదీన వరంగల్ , హనుమకొండ జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కేటీఆర్ రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వివరించారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకస్థాపనలు, మరికొన్ని పూర్తయిన పనులను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కేటీఆర్ టూర్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు.