హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతోపాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అరాచక రాజకీయాలను సాధారణ జనజీవనంలోకి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కిందని శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అరాచక మూకలు మీడియా, సోషల్ మీడియా ముసుగులో తమపై అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. జర్నలిజం ముసుగులో కొన్ని మీడియా సంస్థల యజమానులు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ రాజకీయ ఎజెండాను అమలు చేసేందుకు దండుపాళ్యంముఠాలా మారాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మీడియా ముసుగులో కొందరు కావాలని చేస్తున్న నీచమైన దుష్ప్రచారంతో తనకు ఏమాత్రం ప్రభావం పడదని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ, పదేపదే వీరు చేస్తున్న వ్యక్తిత్వ హననంతో తన కుటుంబసభ్యులు తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛ పేరుతో తెలంగాణ స్వాభిమానాన్ని హేళన చేస్తున్న వైఖరి తన శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులకు బాధ కలిగిస్తున్నదని తెలిపారు. అబద్ధాలను వెనకుండి నడిపిస్తున్న వారితోపాటు దుర్మార్గపూరితంగా ఇలాంటి నీచ పనులు చేస్తున్న ప్రతి ఒకరినీ తగిన రీతిలో చట్టపరంగా ఎదురొంటామని స్పష్టంచేశారు.
కొంతమంది కుట్రపూరితంగా చేస్తున్న ఈ దాడుల విషయంలో శాంతియుతంగా ఉండాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ సోదర, సోదరీమణులంతా ప్రశాంతంగా ఉండాలని కోరారు. పార్టీపై ముఖ్యమంత్రితోపాటు ఆయన అనుచరగణం చేస్తున్న కుట్రలను చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు. గులాబీ పార్టీపై కార్యకర్తలు, నేతలకు ఉన్న ప్రేమ, నిబద్ధతను తాను పూర్తిగా అర్థం చేసుకోగలనని, పార్టీపై, నాయకులపై జరుగుతున్న దుష్ప్రచారంతో వారు పడుతున్న ఆవేదన తనను కూడా కలిచివేస్తున్నదని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డిలాంటి వ్యక్తి రాష్ర్టాన్ని నడిపిస్తుంటే, అబద్ధాలు, దుష్ప్రచారం వంటి నీచమైన విషయాలు సాధారణ అంశాలుగా మారిపోతాయని కేటీఆర్ విమర్శించారు. అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు సమాజంలో అస్సలు తావు ఉండకూడదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తిత్వ హనన దాడులు మెయిన్ స్ట్రీమ్‌కి తీసుకొచ్చిన ఘనత రేవంత్‌రెడ్డి, ఆయన మిత్రులకే చెందుతుందని మండిపడ్డారు. అరాచకత్వం పెట్రేగిపోతుందన్న కేటీఆర్.. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆసారం ఉండకూడదని పేర్కొన్నారు. ఈ విషయాల్లో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. సిగ్గుమాలిన బురదజల్లే రాజకీయాలకు చట్టబద్ధంగా సమాధానం చెప్తామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, రేవంత్ సర్కారు చేస్తున్న అరాచకాలు, మోసాలను ప్రశ్నించడం పైనే గులాబీ సైన్యం దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
ఓ మీడియా చానల్ రాజకీయ ఎజెండాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై దుష్ప్రచారం చేసిందని, ఇది ఎంతమాత్రం సమంజసం కాదని మాజీ మంత్రి హరీశ్ ఖండించారు. ప్రజాజీవితంలో ఉన్న ఆయనపై వ్యక్తిగతంగా బురదజల్లుతూ దురుద్దేశంతోనే తప్పుడు ప్రసారాలు చేయడం దుర్మార్గమమని శనివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రతి నాయకుడి వెనుక ఒక కుటుంబం ఉంటుందని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. దురుద్దేశంతో తప్పుడు వార్తలు ప్రసారం చేయడం జర్నలిజం కాదని ఆక్షేపించారు. ఈ దుర్మార్గపు ప్రచారానికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకొనే హక్కు కేటీఆర్‌కు ఉంటుందని స్పష్టంచేశారు. ఈ విషయంలో ఆయనకు తామంతా అండగా ఉంటామని ప్రకటించారు.
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అరాచకమూకలు మీడియా, సోషల్ మీడియా ముసుగులో మాపై అబద్ధాలు, అసత్యాలను దురుద్దేశపూర్వకంగా ప్రచారాలు చేస్తున్నయి. జర్నలిజం ముసుగులో మీడియా సంస్థల యజమానులు కొన్ని నెలలుగా బీఆర్ఎస్ నాయకత్వంపై, నాపై వ్యక్తిగతంగా విషం చిమ్ముతున్నరు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ రాజకీయ ఎజెండాను అమలు చేసేందుకు దండుపాళ్యం ముఠాలా మారిన మీడియా సంస్థల యాజమాన్యాలను చట్టపరంగా ఎదుర్కొంటం.
– కేటీఆర్