Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరట ఇచ్చాయి. ఇటీవల వరుసగా ధరలు పైపైకి కదులుతూ సరికొత్త గరిష్ఠాలను తాకాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం రూ.500 తగ్గింది. 24 క్యారెట్ల పసిడి రూ.1,13,300కి చేరింది. దాంతో వరుస నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్ పడినట్లయ్యింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర సైతం రూ.500 తగ్గి తులం ధర రూ.1,13,800కి తగ్గింది. మరో వైపు వెండి రూ.300 పెరిగి కిలోకు రూ.1,32,300కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తుండడంతో వెండి ధర పెరుగుతూ వస్తుందని బులియన్ వ్యాపారులు పేర్కొన్నారు. బలహీనమైన యూఎస్ లేబర్ మార్కెట్ డేటా తర్వాత పెట్టుబడిదారులు ద్రవ్య పరపతి విధానంపై దృష్టి సారించారు.
ప్రస్తుతం క్యాలెండర్ సంవత్సరంలో వెండి ధరలు కిలోకు రూ.22,600 పెరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 31న వెండి కిలోకు రూ.89,700 వద్ద కొనసాగింది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ సోమవారం బంగారం తక్కువగా ట్రేడ్ అయ్యిందని.. వ్యాపారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశానికి ముందు కొనుగోళ్లు తగ్గడంతో మధ్యస్తంగా బేరిష్ జోన్లో ట్రేడవుతుందన్నారు. ఫెడ్ రిజర్వ్ సమావేశం 16న మొదలై.. 17న ముగియనున్నది. అదే రోజున విధాన నిర్ణయం ప్రకటించనున్నది. చైర్మన్ జెరోమ్ పావెల్ విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడ్ అధికారుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఫెడ్ రిజర్వ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది. ప్రపంచ మార్కెట్లలో బంగారం ఔన్సుకు స్వల్పంగా 3,645.12 డాలర్లకు చేరుకుంది. వెండి ఔన్సుకు 42.20 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.