Railway Rules | భారతీయ రైల్వే రూల్స్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ ఒకటి నుంచి ఆన్లైన్ టికెట్ల వ్యవస్థలో మార్పులు అమలులోకి రానున్నది. మారిన రూల్స్ ప్రకారం.. జనరల్ రిజర్వేషన్ల టికెట్లకు సైతం ఆధార్‌ను తప్పనిసరి చేయనున్నది. అయితే, ఈ నిబంధనల బుకింగ్ ప్రక్రియ మొత్తానికి కాకుండా.. టికెట్లు అందుబాటులోకి వచ్చిన తొలి 15 నిమిషాల వరకు మాత్రమే వర్తించనున్నది. రైల్వే టికెట్ల బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడంతో పాటు మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే బోర్డు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిబంధన ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ రెండింటిలోనూ వర్తిస్తుందని రైల్వేశాఖ తెలిపింది. వాస్తవానికి రైల్వే టికెట్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే ఏజెంట్లు, బ్రోకర్లు కొన్ని సాఫ్ట్వేర్ల సహాయంతో ముందస్తుగానే టికెట్లను బుక్ చేస్తున్నట్లుగా రైల్వే గుర్తించింది. దాంతో సాధారణ రైల్వే ప్రయాణికులు టికెట్లు పొందలేకపోతున్నారు. అయితే, రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్లో టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఈ క్రమంలో సాంకేతిక మార్పులు చేయాలని రైల్వేలు, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్సీటీసీని బోర్డు ఆదేశించింది. ఈ అంశంపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. మారిన రూల్స్‌కు సంబంధించి మంత్రిత్వశాఖ అన్ని విభాగాలకు సర్క్యూలర్‌ను పంపింది. ప్రస్తుతం జనరల్ రిజర్వేషన్ కోసం బుకింగ్‌ను ప్రతిరోజూ అర్ధరాత్రి 12.20 గంటలకు మొదలై.. రాత్రి 11.45 గంటల వరకు కొనసాగుతుంది. జనరల్ టికెట్ల అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు ప్రారంభమవుతుంది. ఇదిలా ఉండగా.. రైల్వేశాఖ జులైలో ఆన్లైన్ తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ అథంటికేషన్‌ను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ రూల్స్ ప్రకారం ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్‌లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునేందుకు వినియోగదారుల ఆధార్‌ను తప్పనిసరిగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆధార్‌ను ధ్రువీకరించలేకపోతే తాత్కాల్ టికెట్లను బుక్ చేసుకునే వీలు ఉండదు.
ఇదిలా ఉండగా.. రైల్వే నిర్ణయంతో సాధారణ ప్రయాణికులకు ఎంతో ఊరట కలుగనున్నది. త్వరలోనే దసరా, దీపావళి, ఛట్ పూజ సహా పలు పండుగల సమయంలో రైలు టికెట్లకు భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. దాంతో బుకింగ్ ప్రారంభమైన కొద్ది సమయంలోనే టికెట్లు అయిపోయే అవకాశం ఉంది. డిమాండ్‌ను ఆసరా చేసుకొని ఏజెంట్లు, బ్రోకర్లు మోసపూరిత పద్ధతుల్లో టికెట్లను బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో రైల్వే కొత్తగా తీసుకువచ్చిన ఈ ఆధార్ అథంటికేషన్‌తో ప్రయాణికులకు ఊరట కలుగనున్నది. ప్రస్తుతం తత్కాల్ టికెట్లకు అమలు చేస్తున్న ఈ విధానం జనరల్ టికెట్లకు సైతం అమలు చేస్తుండడంతో సాధారణ ప్రయాణికులకు ఉపశమనం కలుగనున్నది.