హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల విముక్తి కోసం కేసీఆర్ సారథ్యంలో సాగిన మలి దశ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరచడంలో తెలంగాణ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. సోమవారం ఆయన హైదరాబాద్లో తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) రజతోత్సవ పోస్టర్ను తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి ఆవిషరించారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకపాత్ర పోషించిన టీజేఎఫ్ 25 వసంతాల సంబురాలు జరుపుకోవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఎన్నో కార్యక్రమాలు అమలుచేశామని చెప్పారు. టీజేఎఫ్కి తాము ఎప్పటికీ అండగా ఉంటామని స్పష్టంచేశారు. అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 31న జలవిహార్లో నిర్వహిస్తున్న రజతోత్సవాలకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్, టెంజు ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్, మాజీ మంత్రులు తలసాని, సునీతాలక్ష్మారెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు.