హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఇటీవల వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి కృతిక ఆరోగ్యం మెరుగైంది. ఆమె తండ్రి సంతు, ఆ ఇంటి యజమాని హరీశ్ చిడుగు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎక్స్ (ట్విటర్) ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ‘హలో కేటీఆర్ సార్.. కృతికకు సాయం చేసేందుకు మీరు చూపిన అసాధారణ ప్రయత్నానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. చిన్నారి కృతిక ఇప్పుడు సుక్షితంగా ఉన్నది.
పెను ప్రమాదం నుంచి బయటపడింది’ అంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేశారు. ఇందుకు కేటీఆర్ స్పందిస్తూ.. ‘బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నందుకు సంతోషం’ అంటూ రీట్వీట్ చేశారు. ఈ నెల 17న హబ్సిగూడ పరిధిలోని రాంరెడ్డినగర్లో ఇంటివద్ద చిన్నారులతో ఆడుకుంటున్న కృతికపై వీధికుక్కలు దాడి చేశాయి. పాప ఎడమవైపు దవడ, చెవి, నోటి భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. సంతు దగ్గర వైద్యానికి డబ్బులు లేకపోవడంతో ఇంటి యజమాని హరీశ్ చిడుగు ఎక్స్ వేదికగా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. తన టీమ్ అన్నీ చూసుకుంటుందని, బాధపడొద్దని ధైర్యం చెప్పారు.