న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: అమెరికన్ టెక్ దిగ్గజం ఒరాకిల్ భారీ స్థాయిలో ఉద్యోగులపై వేటుకు సన్నద్ధమవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఒరాకిల్ యోచిస్తున్నది. దీని ప్రభావం భారత్‌లోని వందలాది మంది ఉద్యోగులపై కూడా పడే అవకాశం ఉంది. క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మౌలిక సదుపాయాలకు పెరుగుతున్న వ్యయాన్ని సమతుల్యం చేసుకునేందుకు, ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీ ఈ చర్య తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. తమ ఖర్చులను తగ్గించుకునే మార్గాలను అన్వేషించాలని ఒరాకిల్ యాజమాన్యం తన వివిధ బృందాలను కోరింది. ఈ నిర్ణయం కారణంగా ఉద్యోగుల తొలగింపు ప్రభావం కేవలం ఒక నిర్దిష్ట వ్యాపార విభాగానికే పరిమితం కాకుండా కంపెనీలోని అనేక విభాగాలపై పడే అవకాశం ఉంది. కంపెనీ అంతర్గత చర్చల ప్రకారం ఈ తొలగింపుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 7,000 నుంచి 10,000 మంది ఉద్యోగులు ప్రభావితం కావచ్చని అంచనా. అయితే, ఒరాకిల్ నుంచి ఈ లెక్కలకు సంబంధించి అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడాల్సి ఉంది.
15న ప్రకటన?
తొలగింపు ప్రక్రియకు సంబంధించిన చర్చలు కంపెనీ ఉద్యోగుల మధ్య జోరుగా సాగుతున్నాయి. ఉద్యోగుల తొలగింపు ప్రకటన సెప్టెంబర్ 1న వెలువడుతుందని భావించినప్పటికీ ఇప్పుడు సెప్టెంబర్ 15న కంపెనీ తన తొలగింపు నిర్ణయాలను ప్రకటించవచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రస్తుతం, ఉద్యోగ తొలగింపుల కచ్చితమైన తేదీ, ప్రభావితమయ్యే ఉద్యోగుల తుది సంఖ్యపై అనిశ్చితి నెలకొని ఉంది. ఏయే స్థాయి ఉద్యోగులను తొలగిస్తారనే విషయంపై చాలా మంది మేనేజర్లకు కూడా ఇంకా పూర్తి అవగాహన లేదు.
భారత్‌పై ప్రభావం
ఉద్యోగాల తొలగింపునకు సంబంధించిన ఈ నిర్ణయం ఒరాకిల్‌లోని భారతీయ ఉద్యోగులకు అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. భారత్‌లో దాదాపు 3 వేల మందిని తొలగించే అవకాశం ఉన్నది ఒరాకిల్‌కు చెందిన ప్రపంచవ్యాప్తం కార్యకలాపాలకు భారత్ ఒక పెద్ద, ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్, క్లౌడ్ సేవలు, టెక్నాలజీ, సపోర్ట్ విభాగాల్లో ప్రధాన బృందాలు పనిచేస్తాయి. దీంతో కోతల్లో అధిక భాగం భారతీయ ఉద్యోగులపై ప్రభావం చూపొచ్చని భావిస్తున్నారు.
మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో ఆందోళన!
దేశంలో ఒరాకిల్ ఉద్యోగులు ఉద్యోగాల కోతపై అనిశ్చితిని ఎదుర్కొంటున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగుల పనితీరును సమీక్షించే ప్రక్రియను చేపట్టింది. ఈ చర్య సంస్థలోని కొంతమంది ఉద్యోగుల్లో ఆందోళనలు రేకెత్తించింది. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌కు చెందిన దాదాపు 500 మంది ఉద్యోగులను పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్స్(పీఐపీ)లో ఉంచినట్లు సమాచారం. ఈ పరిణామం ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఉద్యోగ భద్రతపై ఇప్పటికే ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రభావిత ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. అయితే మైక్రోసాఫ్ట్ మాత్రం పీఐపీలు సంస్థలో సాధారణ ఉద్యోగుల నిర్వహణలో భాగమే తప్ప అవి తప్పనిసరిగా ఉద్యోగాల తొలగింపుతో సంబంధం కలిగి ఉండవని స్పష్టం చేసింది.
దీనిపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ సంస్థలో పీఐపీతోపాటు గ్లోబల్ వాలంటరీ సెపరేషన్ అగ్రిమెంట్స్ కోసం కూడా అధికారిక విధానాలు ఉన్నాయని చెప్పారు. ఉద్యోగులు తమ బాధ్యతలకు సంబంధించిన పనితీరు ప్రమాణాలను చేరుకోలేకపోతే వారికి అదనపు శిక్షణ, మార్గదర్శకత్వం అందించవచ్చని, లేదా వారిని పీఐపీలో ఉంచవచ్చని కంపెనీ తెలిపింది. పరిస్థితిని బట్టి అలాంటి ఉద్యోగులకు స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వైదొలగే అవకాశం కూడా ఉండవచ్చని, లేదంటే ఉద్యోగం నుంచి తొలగించే పరిస్థితి ఏర్పడవచ్చని సంస్థ పేర్కొంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో పీఐపీలకు గురయ్యే వారి సంఖ్య చాలా స్వల్ప శాతం మాత్రమేనని కంపెనీ తెలిపింది. అయితే, వ్యక్తిగత ఉద్యోగులకు సంబంధించిన వివరాలను గానీ, భారత్‌లో లేదా ఇతర ప్రాంతాల్లో పీఐపీలకు గురైన ఉద్యోగుల సంఖ్యకు సంబంధించిన ప్రాంతాల వారీ వివరాలను గానీ మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు.
1,75,000
ఈ ఏడాది ఇప్పటివరకు ఉద్యోగాలు కోల్పోయిన టెకీలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: టెక్ ఉద్యోగుల తొలగింపు ఊచకోత ఈ ఏడాది కూడా కొనసాగుతూనే ఉంది. 2026లో ఇప్పటివరకు 1,75,000 టెక్ ఉద్యోగాలపై వేటు వేశారు. ఇది గత ఏడాది కన్నా వేగం. 2025లో 2,45,000 మంది టెక్ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారని ట్రూఅప్ సంస్థ వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపునకు కృత్రిమ మేధ ప్రధాన కారణమైనప్పటికీ, అదొక్కటే తొలగింపునకు కారణం కాదు. డిమాండ్ తగ్గడం వల్ల కంపెనీలు కూడా ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. సంస్థ పునర్నిర్మాణం, వ్యాపార ప్రణాళికల్లో మార్పు, ఖర్చు తగ్గింపు, కొన్ని రంగాల్లో బలహీనమైన పనితీరు, సంస్థ పెట్టుబడులను ఏఐ, ఇతర కొత్త సాంకేతిక రంగాల్లో పెట్టడం కూడా ఉద్యోగుల తొలగింపునకు కారణమవుతున్నాయి.
తొలగింపులు ఇలా..
ఈ ఏడాది ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం ఉద్యోగుల తొలగింపులో టెక్ దిగ్గజం ఒరాకిల్ ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏడాది కాలంలో 21 వేల మంది ఉద్యోగులను తొలగించామని, మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 13 శాతమని సంస్థ ఇటీవల వెల్లడించింది. కాగా, మరో విడత ఉద్యోగుల తొలగింపునకు యాపిల్ సిద్ధమవుతున్నది. సంస్థకు చెందిన విజన్ గ్రూప్ నుంచి 60 మంది ఉద్యోగులను తొలగించినట్టు తెలిపింది. మైక్రోసాఫ్ట్ కూడా మరో భారీ ఉద్యోగుల ఊచకోతకు సిద్ధమవుతున్నది. కంపెనీకి చెందిన వివిధ సంస్థల నుంచి 4,800 ఉద్యోగాలను (మొత్తం ఉద్యోగుల్లో 2.1 శాతం) తొలగిస్తున్నది. ఇందులో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ గేమింగ్ బిజినెస్‌కు చెందిన ఉద్యోగులు అధికంగా ఉన్నారు. ఇక వీసా సంస్థ తమ మొత్తం ఉద్యోగుల్లో 7 శాతం లేదా 2,600 మందిని తొలగించనున్నట్టు తెలిపింది. మండే.కామ్ 630 ఉద్యోగాలు (20 శాతం), ఉబర్ తమ కస్టమర్ సర్వీస్ విభాగంలో 10 శాతం, లూసిడ్ (18 శాతం), రాక్‌స్పేస్ 750 (15 శాతం), కాయిన్‌బేస్ 700 (14 శాతం), క్లౌడ్‌ఫేర్ 1,100, రివియన్ (2 శాతం), రాబిన్‌హుడ్ (10 శాతం), సేల్స్ ఫోర్స్ 86, ఇంట్యూట్ 3 వేలు (17 శాతం), మెటా 8,000 (10 శాతం), అమెజాన్ 30,000 ఉద్యోగాలను తొలగించాయి. అలాగే సిస్కో ఈ నాలుగో త్రైమాసికంలో 4,000 ఉద్యోగాలను, రానున్న సంవత్సరాల్లో పేపాల్ 4,800 (20 శాతం) మందిని తొలగించనుంది.