‘ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వచ్చిన యువకుడి జీవితంలో ఏం జరిగింది? అతని ప్రేమకథ ఎలా సాగింది? అతని స్నేహితులలో నెలకొన్న గందరగోళం ఏంటి? మొత్తంగా ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ఎక్కడా బోర్ కొట్టించే ఫోర్స్ కామెడీ ఉండదు. సహజంగా, ఆర్గానిక్‌గా సినిమా నవ్విస్తుంది. 2గంటల 20 నిమిషాల పాటు సమయం తెలియకుండా వేగంగా సాగిపోయే వినోదాత్మక చిత్రమిది. సంగీత పరంగానూ అందరికీ నచ్చుతుంది’ అని నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా అన్నారు.
అగ్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మించిన యువతరం ప్రేమకథ ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటించిన ఈ చిత్రానికి వేణుగోపాల్‌రెడ్డి దర్శకుడు. ఈ నెల 3న విడుదల కానున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా విలేకరులతో మాట్లాడారు. ‘ఈ కథలో హ్యూమర్ ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ మధ్య జరిగే సరదా సన్నివేశాలున్నాయి. దర్శకుడు వేణుగోపాల్ మూడ్నాలుగేండ్లుగా మాతో ట్రావెల్ చేస్తున్నారు. ఆయన స్క్రిప్ట్ నెరేషన్ మమ్మల్ని ఆకట్టుకుంది. అందుకే ఈ కథను టేకప్ చేశాం. కథ వినగానే, ముందు ఒక సీన్ చేసుకురమ్మని చెప్పాం.
తను అద్భుతంగా చేసి చూపించాడు. ఆ సీన్ చూశాక సినిమా కూడా బాగా చేస్తాడని నమ్మకం కుదిరింది. అంతే.. ఇక వేణుగోపాల్‌కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ప్రాజెక్ట్ ఓకే అయ్యాక, సందీప్ ఈ సినిమా విషయంలో అస్సలు జోక్యం చేసుకోలేదు. ఆయన ‘స్పిరిట్’ పనుల్లో బిజీగా ఉన్నారు. సినిమా పూర్తయ్యాక ఫస్ట్ కట్ చూసి హ్యాపీగా ఫీలయ్యాడు. సెన్సార్ యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అన్ని వయసులవారూ ఇబ్బంది లేకుండా ఈ సినిమా చూడొచ్చు’ అని చెప్పారు ప్రణయ్‌రెడ్డి వంగా.
హీరోహీరోయిన్లతో పాటు ఇతర కీలక పాత్రధారులు కూడా బాగా నటించారని, టెక్నీషియన్స్ కూడా ప్యాషనేట్‌గా వర్క్ చేశారని, హైదరాబాద్ బేస్డ్గా సాగే ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని ప్రణయ్‌రెడ్డి వంగా పేర్కొన్నారు. ‘ప్రస్తుతం సందీప్‌రెడ్డి వంగా ఫోకస్ అంతా ‘స్పిరిట్’పైనే ఉన్నది. ప్రస్తుతం 40శాతం షూటింగ్ పూర్తయింది. ప్రభాస్ 40రోజులు పనిచేశారు. వచ్చే ఏడాదికి ‘అర్జున్‌రెడ్డి’ విడుదలై పదేండ్లు కావొస్తున్నది. అందుకే.. కొన్ని సీన్స్ యాడ్ చేసి రీరిలీజ్ చేయాలనే ప్లాన్ ఉన్నది. మంచి స్క్రిప్ట్స్ వస్తే చిన్న సినిమాలను కూడా నిర్మిస్తాం’ అని తెలిపారు ప్రణయ్‌రెడ్డి.