హనుమకొండ, నవంబర్ 25 : హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసే దీక్షాదివస్ సన్నాహక సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్టు జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డితో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 29 నుంచి డిసెంబర్ 9 వరకు దీక్షాదివస్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొనే సన్నాహక సమావేశానికి కార్యకర్తలు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 11రోజుల దీక్షా దివస్ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానంపై మరో పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యారంగానికి కేసీఆర్ స్వర్ణయుగం తెచ్చారు. గురుకుల విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ కాలేజీల ఏర్పాటుతో లక్షల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించారు. కాంగ్రెస్ వచ్చాక విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నది. ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై విద్యార్థిలోకం ఉద్యమించాలి.
-కేటీఆర్
తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 (దీక్షా దివస్) మహాఘట్టంగా నిలిచిపోతుంది. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ దీక్ష చేపట్టిన నాటి నుంచి తెలంగాణ ఏర్పాటు ప్రకటనతో దీక్ష విరమించిన డిసెంబర్ 9 వరకు జరిగిన ఉద్యమాన్ని విద్యార్థిలోకానికి గుర్తుచేయాలి. దీక్షా దివస్ను అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో ఘనంగా నిర్వహించాలి.
– బీఆర్ఎస్వీ నేతలకు కేటీఆర్ పిలుపు