హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): హిల్ట్ పాలసీ పేరిట కాంగ్రెస్ పెద్దలు తలపెట్టిన రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. హైదరాబాద్ మహానగర పరిధిలో రూ.5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ’ (హిల్ట్‌పీ) పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రేవంత్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను నిలువరించేందుకు పోరుబాట పట్టనున్నది. ప్రజలకు చెందిన పారిశ్రామిక భూములను సంరక్షించేందుకు నడుంకట్టింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశంలో కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నాయకులతో కూడిన నిజనిర్ధారణ బృందాలను కేటీఆర్ నియమించారు.
పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశ్రామికవాడల్లో క్షేత్రస్థాయి పర్యటనలపై ఆయా బృందాలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి, కనీసం శ్మశాన వాటికలకూ స్థలాల్లేవని చెప్తున్న కాం గ్రెస్ ప్రభుత్వం మరోవైపు వేల కోట్ల భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నదని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన కోసం అతి తకువ ధరకే కేటాయించిన భూములను ఇప్పుడు ‘మల్టీ జోన్’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగా మారుస్తున్నారని విమర్శించారు. సుమారు 9,300 ఎకరాల భూములను మారెట్ విలువ కంటే అతి తకువకు, కేవలం ఎస్ఆర్వో రేటులో 30 శాతానికే రెగ్యులరైజ్ చేసి, సుమారు రూ.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నేడు కేటీఆర్ పర్యటన
క్లస్టర్-4లో బుధవారం మధ్యాహ్నం మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందతో కలిసి జీడిమెట్ల, కూకట్పల్లి ప్రాంతాల్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. క్లస్టర్-1లో మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో గంగుల కమలాకర్, దేశపతి శ్రీనివాస్, మెదక్ ఎమ్మెల్యేల బృందం పాశమైలారం, పటాన్చెరు, రామచంద్రాపురం ప్రాంతాల్లో పర్యటిస్తుంది. క్లస్టర్-2లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సురభి వాణీదేవి, ఉప్పల్ నాయకులు కలిసి నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చెర్లపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారు. క్లస్టర్-3కు సంబంధించి శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, రవీందర్రావు, మౌలాలి, కుషాయిగూడ పారిశ్రామికవాడల్లో పర్యటిస్తారు.
క్లస్టర్-5లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ నవీన్‌రావు, సనత్‌నగర్, బాలానగర్ ఏరియాలను పరిశీలిస్తారు. క్లస్టర్-6లో మాజీ మంత్రి మల్లారెడ్డి, శంభీపూర్ రాజు మేడ్చల్ ఇండస్ట్రియల్ పారును సందర్శిస్తారు. క్లస్టర్-7లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, నేతలు స్వామిగౌడ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి కాటేదాన్, హయత్‌నగర్‌లో పర్యటిస్తారు. చివరగా క్లస్టర్-8లో మాజీ మంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎండీ సలీం, చందూలాల్ బారాదరి పారిశ్రామికవాడలో పర్యటించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరిస్తారు.
3, 4 తేదీల్లో క్షేత్రస్థాయి పర్యటనలు
హైదరాబాద్ చుట్టుపకల ఉన్న పారిశ్రామికవాడలను ఎనిమిది క్లస్టర్లుగా విభజించారు. పార్టీ సీనియర్ నాయకుల నేతృత్వంలో ఎనిమిది బృందాలను ఏర్పాటుచేశారు. బుధ, గురువారాల్లో ఆయా బృందాలు తమకు కేటాయించిన క్లస్టర్లలో పర్యటిస్తాయి. అకడ స్థానిక నాయకులు, ప్రజలను కలుపుకొని వాస్తవ మారెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని బీఆర్ఎస్ నేతలు ప్రజల ముందు పెట్టనున్నారు. అకడి పారిశ్రామికవాడల ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాలు ఏమేం చేయవచ్చు? స్థానిక ప్రజల సుదీర్ఘకాల డిమాండ్లు, ఆకాంక్షలను కూడా పార్టీ నేతలు తెలుసుకోనున్నారు. ఒకప్పుడు అకడ పారిశ్రామికవాడల ఏర్పాటు కోసం ప్రజలు భూములిచ్చిన తీరు, ప్రభుత్వం కేటాయించిన తీరును, వాటిని చవకగా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు కట్టబెట్టిన అంశాన్ని, వాటి ఉద్దేశాలను వివరించనున్నారు.