హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ సిల్వర్‌జూబ్లీ సంబురాలను సమాయత్తమవుతున్నది. వేడుకలు ఘ నంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. సంబురాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. జిల్లా కేంద్రా ల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నా రు. ఈ నెల 20న సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణభవన్‌లో సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులతో విసృ్తతస్థాయి సమావేశం నిర్వహించారు. వరంగల్ లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనునట్టు పార్టీ ఇప్పటికే ప్రకటించింది.
పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం
బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. 14 ఏండ్ల ఉద్యమం ప్రస్థానం, పదేండ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్ఎస్ పార్టీ పెనువేసుకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సమావేశాల సందర్భంగా మరోసారి గుర్తుచేసుకోనున్నారు. ఎన్ని రకాల ఒడిదుడుకులు ఎదురైనా గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని నిలబడ్డ పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో మళ్లీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేటీఆర్ భరోసా ఇవ్వనున్నారు.