హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పిడిపై బీఆర్ఎస్ పార్టీ పోరుకు సిద్ధమైంది. అధికారిక చిహ్నం నుంచి చారిత్రక చిహ్నాలు చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చార్మినార్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ నాయకులతో కలిసి చార్మినార్‌కు చేరుకోనున్నారు.
హైదరాబాద్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది చార్మినార్. కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకర్షించే చారిత్రక కళా రూపం. ఇదేదో ఒక రాజ్యానికి ప్రతీకగా, ఒక రాజు కీర్తికి గుర్తుగా జరిగిన నిర్మాణం కాదు. ఎందరినో బలి తీసుకున్న ప్రాణాంతకమైన ప్లేగు మహమ్మారి అంతమైనందుకు గుర్తు. అంతటి సదుద్దేశం ఉన్నందునే కాబోలు నాలుగు శతాబ్దాలకుపైగా చెక్కుచెదరకుండా ఆ కట్టడం నిలబడింది. హైదరాబాద్‌కే తలమానికం అది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అందుకే కేసీఆర్ ప్రభుత్వం అనేకమంది చరిత్రకారుల అభిప్రాయాలను క్రోడీకరించి ఈ చారిత్రక కళారూపానికి రాష్ట్ర అధికారిక చిహ్నంలో స్థానం కల్పించారు. కానీ రేవంత్ ప్రభుత్వం చార్మినార్‌ను రాజరికపు ఆనవాలుగా చూడటం అందరినీ ఆవేదనకు గురి చేస్తున్నది. ఏ ప్రభుత్వమైనా అరుదైన వారసత్వ కట్టడాలకు అంతర్జాతీయ గుర్తింపు రావాలని కోరుకుంటుంది. అయితే, ఇక్కడ ప్రతికూల దృక్పథంతో చారిత్రక నిర్మాణంపై రాజరికపు ముద్ర వేయడం దురదృష్టకరమని చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ గ్లోబల్ ఐకాన్
ప్రపంచంలోని అరుదైన వారసత్వ కట్టడాల్లో ప్రత్యేక స్థానం సాధించుకున్న చార్మినార్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అధికారిక చిహ్నంలో చోటు సాధించినపుడు విస్తృతస్థాయిలో చర్చ జరిగింది. ఆపై తాజాగా రేవంత్ ప్రభుత్వం చార్మినార్‌పై రాజరికపు ఆనవాళ్ల ముద్ర వేసిన ఈ సందర్భంలోనూ మరోసారి చర్చకు దారి తీస్తున్నది. నాలుగు మినార్ల (స్తంభాలు)తో హైదరాబాద్ గ్లోబల్ ఐకాన్‌గా అవతరించిన ఈ చారిత్రక నిర్మాణం 433 ఏండ్ల కిందట అంటే 1591లో రూపుదిద్దుకున్నది. చార్మినార్ కమాన్, కాలీ కమాన్, మచిలీ కమాన్, షేర్ ఏ బాతుల్ పేరిట 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇండో-పర్షియన్ పద్ధతిలో ఈ కమాన్ల నిర్మాణం జరిగింది. అందుకే సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన అధికారిక కట్టడాల జాబితాలో పురావస్తు, నిర్మాణనిధిగా చార్మినార్‌ను చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న ప్రాణాంతకమైన ప్లేగు వ్యాధిపై సాధించిన విజయానికి, గోల్కొండ నుంచి ప్రస్తుత హైదరాబాద్ నగరానికి రాజధాని మార్చిన సందర్భంలో మహమ్మద్ ఖులీ కుతుబ్‌షా చార్మినార్‌ను నిర్మించారు.
మతసామరస్యానికి ప్రతీక
వినూత్న నిర్మాణ శైలి, చెక్కు చెదరని వారసత్వ సంపదకు చిహ్నంగా ఉన్న చార్మినార్‌కు, హైదరాబాద్ నగరానికి విడదీయలేని బంధం ఉన్నది. ఆర్కియాలజీ పరిశోధనల్లో చార్మినార్ నిర్మాణశైలి ఇప్పటికీ ఒక వింతైన కట్టడంగానే నిలుస్తున్నది. ఓవైపు మక్కామసీదు, మరోవైపు భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంతో కూడిన ఈ చార్మినార్ ప్రాంగణం మత సామరస్యాన్ని పెంపొందించే వేదిక. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ వారసత్వ నిర్మాణం దెబ్బతినకుండా అనేక చర్యలు తీసుకున్నారు. వాహన కాలుష్యం బారిన పడకుండా చుట్టూ పాదచారుల వంతెన నిర్మించారు. స్వరాష్ట్రంలో చారిత్రక వారసత్వ సంపదకు జీవంపోసేలా చార్మినార్ సమీపంలో చేపట్టిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ఆ కట్టడం మరింత శోభాయామానంగా వెలుగుతున్నది. తెలంగాణ సాధన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం చరిత్రకారులతో విస్తృతంగా చేపట్టిన చర్చల్లో భాగంగానే అధికారిక చిహ్నంలో చార్మినార్‌ను చేర్చారు. దీనికి తెలంగాణవ్యాప్తంగా ప్రజల ఆమోదం కూడా లభించింది. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం రాజకీయ కోణంలో కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే కుట్రలో భాగంగా చరిత్రను చెరిపేసేందుకు ప్రయత్నిస్తుండటం చరిత్రకారులను ఆందోళనకు గురిచేస్తున్నది. చారిత్ర క, వారసత్వ కట్టడాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కృషిచేయాల్సిన ప్రభుత్వమే.. రాజరికపు ముద్ర అని నెగెటివ్ ము ద్ర వేయటం చరిత్రను వక్రీకరించే దుస్సాహసమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.