హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో ఈ నెల 16 నుంచి 20 వరకు జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు-2023లో పాల్గొనేందుకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం శనివారం సాయంత్రం బయలుదేరి వెళ్లింది. ఆదివారం మధ్యాహ్నం జ్యూరిచ్ చేరుకొని అక్కడినుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు వెళ్తారు. సముద్ర మట్టానికి 1,560 మీటర్ల ఎత్తులో ఉన్న దావోస్‌లోని ఆల్పైన్ రిసార్ట్ టౌన్ ఈ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ ఏడాది సదస్సును ‘కోఆపరేషన్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్’ అనే థీమ్‌పై నిర్వహిస్తున్నారు. సదస్సులో ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్‌లో ప్రపంచ అగ్రగామి సంస్థల అధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశం అవడంతోపాటు డబ్ల్యూఈఎఫ్ ఏర్పాటుచేస్తున్న వివిధ బృంద చర్చల్లో పాల్గొంటారు. రాష్ర్టానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రగతిని వివరించేందుకు తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ కేటీఆర్ సంపూర్ణంగా వినియోగించుకొంటున్నారు. ఈ క్రమంలోనే ‘తెలంగాణను అగ్రగామి టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చడంలో మీ నాయకత్వం ఎంతో కీలకమైంది’ అని డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే పంపిన ఆహ్వానంలో కొనియాడారు. రాష్ట్ర ప్రతినిధి బృందం 2021 మినహా 2018 నుంచి ఈ సదస్సులో పాల్గొంటున్నది. తెలంగాణ బృందంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఆటోమోటివ్ విభాగం డైరెక్టర్ గోపాల్ కృష్ణన్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు ఉన్నారు.
ప్రధాన ఆకర్షణగా కేటీఆర్ ప్రసంగాలు
మంత్రి కేటీఆర్ డబ్ల్యూఈఎఫ్‌లో గతంలో చేసిన ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ప్రముఖులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ప్రతిసారి తెలంగాణ అనుకూలతలు, ఇక్కడి పారిశ్రామిక విధానాలను అందరికీ హత్తుకొనేలా కేటీఆర్ వివరిస్తున్నారు. కేటీఆర్ వివరించిన తీరుకు ముగ్ధులైన పలువురు పారిశ్రామికవేత్తలు గత ఏడాది సమావేశాల సందర్భంగా తెలంగాణలో రూ.4,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఈ ఏడాది అంతకుమించి పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. గత సదస్సుల సందర్భంగా కేటీఆర్ అనేక దిగ్గజ కంపెనీల ప్రముఖులతో సమావేశమై రాష్ర్టానికి పెట్టుబడులు రాబట్టేందుకు తీవ్రంగా కృషిచేశారు. సమయాభావం వల్ల అక్కడ విస్తారంగా చర్చించే వీలు లేకపోవడంతో కొన్ని కంపెనీల అధిపతులు హైదరాబాద్ వచ్చి మంత్రితో సమావేశమై పెట్టుబడి ప్రకటనలు చేయడం విశేషం.
గత ఏడాది దావోస్ సదస్సు సందర్భంగా వచ్చిన పెట్టుబడులు కొన్ని
లులూ గ్రూపు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.500 కోట్లు.
స్పెయిన్‌కు చెందిన కీమో ఫార్మా రూ.100 కోట్లతో విస్తరణ. ఇప్పటికే కీమో రూ. 170 కోట్లతో రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.
స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంకింగ్ సంస్థ స్విస్ రే హైదరాబాద్ నగరంలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో 250 మందికి ఉద్యోగాలు.
ఆశీర్వాద్ పైప్స్ (అలియాక్సిస్ గ్రూపు) సంస్థ రూ.500 కోట్లు. 500 మందికి ప్రత్యక్ష ఉద్యోగావకాశాలు
స్విట్జర్లాండ్ కు చెందిన ఫెర్రింగ్ ఫార్మా రూ.500 కోట్లతో విస్తరణ.
ష్నైడర్ ఎలక్ట్రిక్ మరో యూనిట్ ఏర్పాటు. మరో వెయ్యి మందికి ఉద్యోగాలు.
స్టాడ్లర్ రైల్ కంపెనీ మేదా సెర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి తెలంగాణలో రూ. 1,000 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇందులో 2,500 మందికి ఉద్యోగాలు.
జీఎంఎం ఫాడులర్ 3.7 మిలియన్ డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో తయారీ కేంద్రాన్ని విస్తరించనున్నట్టు ప్రకటించింది.
హ్యుండాయి రూ.1,400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది.
స్వీడన్‌కు చెందిన ఈఎంపీఈ డయాగ్నోస్టిక్స్ దశలవారీగా రూ.207 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది.
గత సదస్సులో కేటీఆర్‌తో భేటీ అయిన ప్రముఖులు
2022లో దావోస్‌లో నిర్వహించిన డబ్ల్యూఈఎఫ్ సదస్సు సందర్భంగా అనేకమంది దిగ్గజ కంపెనీల ప్రముఖులు మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. నోవార్టిస్ సీఈవో వసంత్ నరసింహన్, ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, వైస్ చైర్మన్ రాజన్ భారతీ మిట్టల్, హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌషల్, బైజూస్ సహ వ్యవస్థాపకులు రవీంద్రన్, దివ్య గోకుల్‌నాథ్, రోచె చైర్మన్ డాక్టర్ క్రిస్టోఫ్ ఫ్రాంజ్, ఆధ్యాత్మికవేత్త జగ్గీ వాసుదేవ్ తదితరులు మంత్రిని కలిశారు.