KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ఆహ్వానం అందింది. శివ్‌నాడార్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక సదస్సు IGNITION లో పాల్గొని ప్రసంగించాలని ఆహ్వానించారు. రేపు (డిసెంబర్ 2) సాయంత్రం 6.30 గంటలకు జర్నలిస్ట్ శోమా చౌదరి నిర్వహణలో చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో ఈ సదస్సు జరగనుంది. దేశంలోని ప్రముఖ నాయకులు, ఆర్థికవేత్తలు, విధాన రూపకర్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.
ఈ కార్యక్రమంలో రీబూటింగ్ ది రిపబ్లిక్ అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించనున్నారు.
దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్‌ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై కేటీఆర్ తన ఆలోచనలను పంచుకోనున్నారు. ఈ వేదికపై జాతీయ రాజకీయాలకు సంబంధించిన పలు కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించే అవకాశముంది.
IGNITION ప్లాట్‌ఫామ్ పబ్లిక్ పాలసీ, ఆర్థిక శాస్త్రం, సైన్స్ సాంకేతిక రంగాల నుంచి అగ్రశ్రేణి ఆలోచనాపరులను హోస్ట్ చేయడానికి పేరుగాంచింది. కేటీఆర్ సెషన్ తర్వాత, కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త దేవేష్ కపూర్ పాల్గొనే మరొక ముఖ్యమైన సంభాషణ జరగనుంది. ఈ సదస్సు భారతదేశ భవిష్యత్తుపై లోతైన మరియు నిర్మాణాత్మకమైన చర్చలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది.