హైదరాబాద్, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక కోసం నెల రోజులుగా పార్టీ తరఫున శ్రమించిన నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారక రామారావు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఆదేశాల మేరకు తమతమ ప్రాంతాల నుంచి మునుగోడు చేరుకొని టీఆర్ఎస్ సుపరిపాలనను నియోజకవర్గ ప్రజలకు వివరించి, పార్టీ గెలుపు కోసం శ్రమించిన ఇన్చార్జీలు, వారితో వచ్చిన కార్యకర్తలు, నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు సహకారం అందించిన సోషల్ మీడియా వారియర్లకు అభినందనలు తెలిపారు.