
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు తూర్పారబట్టారు. ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో వ్యంగ్యాస్ర్తాన్ని సంధించారు. ఈ మధ్య వారణాసి వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ కూలీలతో కలిసి భోజనం చేశారు. ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్.. లాక్డౌన్ సమయంలో వలస కూలీలు వందల కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఫొటోలను కూడా జతచేస్తూ.. ఎన్నికలు ఉన్నప్పుడు, ఎన్నికలు లేనప్పుడు కేంద్రం, ప్రధాని మోదీ ఎలా వ్యవహరిస్తారన్నదాన్ని కండ్లకు కట్టారు. ‘ఎన్నికలు ఉంటే ఇలా కూలీలతో కలిసి భోజనం.. లేకపోతే అలా వలస కూలీలను గాలికొదిలేసి ప్రత్యక్ష నరకం’ అని కామెంట్ చేశారు. ‘లక్షలాది వలస కార్మికులు వందల కిలోమీటర్లు నడిచినప్పుడు ఈ ప్రేమ, కరుణ ఎక్కడ పోయాయో ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉన్నది’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నిజానికి శ్రామిక్ రైళ్లలో చార్జీలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలపై ఒత్తిడి తెచ్చిందని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు సైతం భారీగా స్పందించారు. కరోనా సమయంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కూలీలు ఎదుర్కొన్న దయనీయ స్థితిని గుర్తుచేశారు. అదే సమయంలో తెలంగాణ సర్కారు వలస కూలీలకు బాసటగా నిలిచిందని కొనియాడుతూ ట్వీట్లు చేస్తున్నారు.