హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): గడిచిన 50 ఏండ్లలో వీ హనుంతరావు, కే కేశవరావు, డీ శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య లాంటి తెలంగాణ బీసీ నాయకులు పీసీసీ అధ్యక్షులు అయ్యారు కానీ, ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రశ్నించారు. ఇది బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి? అని ఎద్దేవా చేశారు. బుధవారం ఈ మేరకు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే రాజ్యాంగబద్ధమైన శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, రాజ్యసభ సభ్యులుగా బీసీ నేతలకు కేసీఆర్ అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు.
ప్రస్తుతం బీఆర్ఎస్కు మూడు ప్రొటోకాల్ పదవులు ఉన్నాయని, ఆ పదవుల్లో కేసీఆర్, మధుసూదనాచారి, బండ ప్రకాశ్ కొనసాగుతున్నారని తెలిపారు. అయితే ఈ మూడు పదవుల్లో రెండింటిలో బీసీ నేతలే కొనసాగుతున్నారని చెప్పారు. ఇది బీసీల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నిబద్ధత, చిత్తశుద్ధి అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘మాకు హితవు పలికే ముందు మీ దుస్థితిని ఆలోచించుకో.. పార్టీలు ఫిరాయించి, మీ పార్టీ అధినేత సోనియమ్మను బలిదేవతగా వ్యాఖ్యానించి, పదవుల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎన్ని పార్టీలైనా మార్చే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగా, జీవితాంతం పార్టీనే నమ్ముకొని, పార్టీని సర్వస్వంగా ఆరాధించే వాళ్లను విస్మరించడం, పదవులు ఇవ్వకుండా అవమానించడం మీ పార్టీకే చెల్లిందని మీరు గ్రహిస్తే మంచిది’ అని కేటీఆర్ చురకలంటించారు.