హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) ర్యాంకుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషిచేద్దామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు పిలుపునిచ్చారు. ఆయా శాఖలకు చెందిన సంస్కరణలు, సన్నాహక ప్రక్రియపై ఆయన దిశానిర్దేశం చేశారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఈవోడీబీ ర్యాంకుల ప్రక్రియపై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ సహా వివిధ శాఖాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మార్గదర్శనం, ప్రభుత్వ శాఖాధిపతుల కృషివల్ల గతంలో ఈఓడీబీలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని, ఈసారి కూడా అదే ఒరవడిని కొనసాగించేందుకు కృషిచేయాలని సూచించారు. ఈసారి ఈవోడీబీ ర్యాంకుల నిర్ధారణలో యూజర్ ఫీడ్‌బ్యాక్ అంశం అత్యంత కీలకమని, పారిశ్రామికవర్గాల నుంచి కేంద్రం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుందని చెప్పారు. దీంతో ఆయా శాఖలవారీగా మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించి అధికారులకు సూచనలు ఇచ్చారు.