లగచర్ల బాధితులు చేసిన పోరాటానికి ప్రభుత్వం దిగి వచ్చింది. ‘ఫార్మా’ నోటిఫికేషన్ రద్దు చేసుకున్నది. అవే భూములను పారిశ్రామిక కారిడార్ పేరుతో సేకరించడం మానుకోవాలి. నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేయాలి. గిరిజన భూములను వదిలిపెట్టి, సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబానికి వెల్దండలో ఉన్న 500 ఎకరాల భూములను సేకరించి పరిశ్రమల కోసం ఉపయోగించాలి.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): లగచర్లలో భూసేకరణ రద్దయ్యే దాకా తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని, అప్పటి దాకా పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. ప్రభుత్వం భూసేకరణ బాధితులపై అన్యాయంగా పెట్టిన కేసులన్నింటినీ బేషరతుగా వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శనివారం లగచర్ల బాధితులు తాము ఎదురొంటున్న సమస్యలను తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ను కలిసి వివరించారు. బాధితుల యోగక్షేమాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వేధింపులను మాని బాధితుల సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేశారు. పోలీసుల ద్వారా బాధిత కుటుంబాలను వేధించడం మానుకోవాలని, ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం తగదని హితవు చెప్పారు.
ఈ విషయంలో ఆయన వికారాబాద్ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. బాధితులపై పెట్టిన అక్రమ కేసుల పేరుతో పోలీసు వేధింపులను నిలిపివేయాలని కోరారు. లగచర్ల రైతు బాధితులను ఢిల్లీ వరకు తీసుకెళ్లామని, వారికి అండగా నిలిచామని , వారి డిమాండ్లను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని కేటీఆర్ తెలిపారు. భూముల కోసం న్యాయమైన పోరాటం చేస్తున్న బాధితులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. గిరిజన, పేద రైతుల హకుల పరిరక్షణ కోసం తమ పార్టీ బాధితుల తరఫున నిలబడుతుందని భరోసా ఇచ్చారు. గిరిజనుల భూములు గుంజుకోవడం రేవంత్ దుర్మార్గానికి నిదర్శనమని దుయ్యబట్టారు. జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి వంటి వారి తరపున, అక్రమంగా కేసులతో జైల్లో ఉన్న బాధితుల తరఫున బీఆర్ఎస్ పార్టీ న్యాయపోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
‘నమ్మి నానబోస్తే’ లఘు చిత్రాన్ని విడుదల చేసిన కేటీఆర్
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఏడాది కాంగ్రెస్ పాలనపై రూపొందిన ‘నమ్మి నానపోస్తే’ లఘు చిత్రాన్ని శనివారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ విడుదలచేసి పార్టీ నేతలతో కలిసి వీక్షించారు. 22 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ఫిల్మ్తోపాటు రసమయి పాడిన ‘అంతా ఉత్తదే’ పాటను కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ వెలవెలబోతుంటే.. తెలంగాణభవన్ నిత్యం ప్రజలతో కళకళలాడుతున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్పై ప్రజలకు ఏమాత్రం అభిమానం తగ్గలేదని, ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి ఎన్నడూలేనంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఒక సర్వే వెల్లడించిందని వివరించారు. గత ఎన్నికల్లో కోల్పోయిందని అధికారం మాత్రమేనని, ప్రజల కోసం పోరాడే పార్టీ లక్షణం, ఉద్యమయావ కాదని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజల కోసం, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అంతే నిబద్ధతతో పనిచేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలను నమ్మి మోసపోయి గోసపడుతున్న తెలంగాణ సమాజం తీరును రసమయి కండ్లకు కట్టినట్టు షార్ట్‌ఫిల్మ్‌లో చూపించారని కేటీఆర్ కొనియాడారు. ఈ షార్ట్‌ఫిల్మ్ సూటిగా, సుత్తిలేకుండా తెలంగాణ యాసలో తీశారని ప్రశంసించారు. ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను ఇది ప్రతిబింబించిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పోరాటాలకు మంచి స్పందన
వచ్చే ఏప్రిల్‌తో బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అవినీతి, ప్రజలను పెడుతున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ చేసిన పోరాటానికి, ఆందోళనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని తెలిపారు. ఏడాది కాలంలో పార్టీ అనేక గడ్డు పరిస్థితులను చవిచూసిందని, వాటన్నింటినీ దాటుకొని తిరిగి బీఆర్ఎస్ బలంగా నిలబడిందని వివరించారు. సమాజంలోని ప్రతి వర్గాన్ని కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక రేవంత్‌రెడ్డి సర్కారు చేతులెత్తేసిందని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో పెండింగ్ బిల్లులు చెల్లింపుపై మాట్లాడాలని మాజీ సర్పంచులు, తమ గురించి మాట్లాడాలని ఆశా వరర్లు తనను కోరారని వెల్లడించారు. ప్రజాక్షేత్రంలో, అసెంబ్లీలో ప్రజల సమస్యను లేవనెత్తుతామని, సర్కారు వైఫల్యాలను ఎండగడతామని స్పష్టంచేశారు.
9న మరో షార్ట్‌ఫిల్మ్: రసమయి
ఈ నెల 9న ‘తల్లిగోస’ అనే మరో షార్ట్‌ఫిల్మ్‌ను విడుదల చేయనున్నట్టు రసమయి బాలకిషన్ చెప్పారు. ఆర్బీ టీవీ ఆధ్వర్యంలో ఇలాంటి షార్ట్‌ఫిల్మ్‌లు నెలకొకటి చొప్పున తీసుకొస్తామని తెలిపారు. షార్ట్‌ఫిల్మ్‌లు, పాటల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తున్న తీరును వివరిస్తామని తెలిపారు. సభలను, సమావేశాలను ప్రభుత్వం అడ్డకోవచ్చు కానీ, సెల్ఫోన్లో వచ్చే సాహిత్యాన్ని, ప్రజావ్యతిరేకతను అడ్డుకోలేదని అన్నారు.
ఉద్యమస్ఫూర్తితో షార్ట్‌ఫిల్మ్: మధుసూదనాచారి
ఉద్యమస్ఫూర్తితో షార్ట్‌ఫిల్మ్ తీయడం గొప్ప విషయమని రసమయిని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి ప్రశంసించారు. రేవంత్‌రెడ్డి సాగిస్తున్న దుర్మార్గ, రాక్షస పాలనను నాటి ఉద్యమ స్ఫూర్తితో ప్రశ్నిస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మెతుకు ఆనంద్, చంటి క్రాంతికిరణ్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సుంకె రవిశంకర్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్, డాక్టర్ చెరుకు సుధాకర్, తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.