ప్రీపెయిడ్ విద్యుత్తు మీటర్లను తెలంగాణలో పెట్టాలని గతంలో కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఒత్తిడి తెచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.30 వేల కోట్ల రుణాలను కేంద్ర సర్కార్ ఆపినా కేసీఆర్ వెనకి తగ్గలేదు. రైతుల ప్రయోజనాల కోసం మోదీని ఎదిరించిన ఘనత కేసీఆర్దైతే.. మూడు నెలల్లోనే ఇండ్లు, వ్యవసాయ మోటర్లకు ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని శనివారం రాష్ట్ర క్యాబినెట్లో కాంగ్రెస్ నిర్ణయించడం దారుణం.
– కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ) : మోటర్లకు మీటర్లు పెట్టకముందే.. ప్రతి ఒకరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకురాకముందే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసివేయాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ మోటర్లకు, ఇండ్లకు ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన నిప్పులు చెరిగారు. కేవలం ఉచిత విద్యుత్‌ను ఎత్తేయడానికి, విద్యుత్తురంగాన్ని అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకే రేవంత్‌రెడ్డి సరార్ ఈ కుట్రకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ వస్తే ఉచిత కరెంట్ పోతుందని తాము ఎన్నికల ముందే హెచ్చరించిన విషయాన్ని కేటీఆర్ నొక్కి చెప్పారు.
ఆదివారం హైదరాబాద్‌లోని అంబర్‌పేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోటర్లకు మీటర్లు పెట్టి పూర్తిగా రైతన్నలకు ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ ఎగ్గొట్టడంతో పాటు ప్రతి ఒకరి ఇంట్లో ప్రస్తుతం ఉన్న మీటర్లు తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. గతంలో దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైన ప్రీపెయిడ్ మీటర్లను రాష్ట్రంలో పెట్టాలని ప్రధాని మోదీ తీవ్ర ఒత్తిడి తెచ్చారని, ఇందుకోసం రాష్ట్రానికి రావాల్సిన రూ.30వేల కోట్ల రుణాలను ఆపినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెనకి తగ్గలేదని కేటీఆర్ గుర్తుచేశారు.
రైతుల ప్రయోజనాల కోసం మోదీని ఎదిరించిన ఘనత కేసీఆర్‌ది అయితే.. అధికారంలోకి రాగానే వచ్చే మూడు నెలల్లోనే ఇండ్లు, వ్యవసాయ రంగానికి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని శనివారం క్యాబినెట్లో కాంగ్రెస్ నిర్ణయించడం దారుణమని మండిపడ్దారు. మొబైల్ రీఛార్జ్ తరహాలో కరెంట్ మీటర్లు పెట్టి, పేదలు, రైతుల పొట్టగొట్టే ఈ కరెంటు కుట్రలపై ప్రజలు తిరుగబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ధాన్యం, వడ్లు, మకలు కొనుగోలు చేయకపోవడంతో ఎకడికకడ రైతులు రోడ్లపైనే ఆరబోసుకుని కూర్చున్నారని తెలిపారు.
ఒకవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలపైనే రైతులు గుండెలాగి చనిపోతున్నారని, మరోవైపు వడదెబ్బకు అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేకుండా వ్యవహరిస్తున్నది. ఇవాళ రైతుల కండ్లల్లోంచి కన్నీరు కాదు, నెత్తురు కారుతున్నది’ అంటూ సాగునీరు, సాయం అందక రైతాంగం పడుతున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు.
కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు బలమైన గుణపాఠం చెప్తారని కేటీఆర్ పేర్కొన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి, అడుగడుగునా అరాచకాలు, అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో సగం పూర్తయినా ఇప్పటిదాకా ప్రజలకు గాని, రాష్ట్రానికి గాని కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేక చేతులెత్తేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, పరిపాలనా వైఫల్యాలు, అవినీతిపై ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, కచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని కేటీఆర్ తెలిపారు.
రైతన్నలకు ఇస్తున్న ఉచిత విద్యుత్తును ఎగ్గొట్టడమే కాదు.. ప్రతి ఒక్కరి ఇంట్లో మీటర్లు తీసేసి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తున్నది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు, ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు పెట్టకముందే కాంగ్రెస్ ఫ్యూజులు పీకేయాలె. విద్యుత్తు రంగాన్ని ప్రైవేట్‌పరం చేసే ఎత్తుగడను
ముక్తకంఠంతో అందరూ వ్యతిరేకించాలి.
– కేటీఆర్
ఉన్న నగరాన్నే పట్టించుకొనే దిక్కు లేదు కానీ, ఫ్యూచర్‌సిటీ అంటూ అడ్డగోలు మాటలు చెప్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రస్తుత హైదరాబాద్ నగరంలో కనీసం మోరీ తీసి చెత్త ఎత్తే పరిస్థితిలో కూడా లేని మున్సిపల్ శాఖ మంత్రి, సీఎం రేవంత్‌రెడ్డి, ఫ్యూచర్‌సిటీ అంటే ఎవరూ నమ్మరని విమర్శించారు. ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్‌సిటీ కడుతాడంటే పట్టించుకునేదెవరు అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో మూసీని ప్రక్షాళన చేస్తామంటున్న ముఖ్యమంత్రి ఆలోచన, ప్రణాళికపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
మూసీ నది పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రూ.1.5 లక్షల కోట్ల ప్రాజెక్టు ఒక పెద్ద కుంభకోణమని, కేవలం రూ.16వేల కోట్లతో పూర్తయ్యే పనులకు అంత భారీ మొత్తాన్ని ఎందుకు తగలేస్తున్నారని కేటీఆర్ నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలోనే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టి, పూర్తయిన మూసీ నది ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించారు.
ముగిసిపోయిన మూసీ ప్రక్షాళనపై రేవంత్‌రెడ్డి కేవలం కాంట్రాక్ట్ కమీషన్ల కోసమే మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఎలాంటి విధ్వంసం లేకుండా, ఇండ్ల తొలగింపు లేకుండా మూసీ నదిని ప్రక్షాళన చేయాలని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే, ఇప్పుడు ఉన్న రేవంత్‌రెడ్డి మాత్రం వేలాది మంది ఇండ్లు కూలగొట్టి, మూసీ ప్రక్షాళన పేరుతో లక్షలాది మంది ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ సిటీలో కనీసం మోరీ తీసి చెత్త ఎత్తే పరిస్థితి లేదు. ఫ్యూచరే లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్‌సిటీ కడుతాడంటే నమ్మేదెవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టి, పూర్తయిన మూసీ నది ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు.
– కేటీఆర్
త్వరలోనే సభ్యత్వ నమోదు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం వెయ్యి మంది వరకే పార్టీ కార్యకర్తలకు ఈ శిక్షణ ఇస్తామని, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేస్తున్న తీరుపై కూడా అవగాహన కల్పిస్తామని తెలిపారు.
ఈసారి సభ్యత్వం పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ముందుగా సభ్యత్వ నమోదు, తర్వాత శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ప్రజా సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసిన వారికే టికెట్లు ఇస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. సర్వే ఆధారంగా అవకాశం ఇస్తామని తెలిపారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అన్యాయాలు, అరాచకాలను ప్రతి ఒకరూ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.
ఒక ఇల్లూ కట్టని రేవంత్‌రెడ్డి, హైడ్రా పేరుతో అడ్డగోలుగా వేలాది ఇండ్లు కూలగొట్టారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్‌లో లక్ష ఇండ్లు నిర్మిస్తే, కాంగ్రెస్ మాత్రం వేల ఇండ్లు కూలగొట్టిందని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.