KTR | నాగర్‌కర్నూల్ (నమస్తే తెలంగాణ)/తిమ్మాజిపేట, సెప్టెంబర్ 14: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బూతులు తిట్టిన కంపెనీలకే నేడు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎందుకు అప్పగించారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టుగా సగం పనులు మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి, మరో సగం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ సంస్థకు అప్పగించారని విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి ఇటీవల మృతి చెందగా శనివారం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ గ్రామానికి వెళ్లి పరామర్శించారు. శ్వేతారెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించి లక్ష్మారెడ్డిని, కుటుంబసభ్యులకు ఓదార్చారు. అనంతరం నేరెళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదంతో దాదాపుగా రూ.80 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని, ఇందుకు కారణమైన మేఘా సంస్థకు రూ.4,350 కోట్ల విలువైన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎలా అప్పజెప్పారని ప్రశ్నించారు. ఈ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని కోరారు. నీ సొంత నియోజకవర్గంలో పనులను.. ఏ కంపెనీ అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నావో.. అదే మేఘా కంపెనీకి అప్పగిస్తుంటే నీ నైజం, రంగు, నిజాయితీ ఏమిటో ప్రజలకు తెలుసున్నదని వ్యాఖ్యానించారు. బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు ఏం ఆశించి పనులు ఇచ్చావో చెప్పాలని డిమాండ్ చేశారు.
‘పాలమూరు’ను పూర్తి చేస్తరా? లేదా?
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను 95% పూర్తి చేసిందని, కాంగ్రెస్ సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తరా? లేదా? పనులు పూర్తి చేసి ప్రారంభిస్తే కేసీఆర్‌కు మంచి పేరొస్తుందనా? ఈ ప్రాజెక్టుకు డబ్బులివ్వడానికి మనసొస్తలేదా? నీ బాధేంది? నీ భయమేంది?’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్నించారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించిందని వివరించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలోనే నార్లాపూర్‌లో నీటి పంపింగ్ ప్రారంభించామని గుర్తుచేశారు.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిపోయిన పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నదని ధ్వజమెత్తారు. కేవలం 5% భూసేకరణ పనులు మిగిలాయని పేర్కొన్నారు. ఈ పనులకు సైతం బీఆర్ఎస్ హయాంలోనే టెండర్లు పిలిస్తే, కాంగ్రెస్ వాటిని రద్దు చేసిందని ఆరోపించారు. కొల్లాపూర్ నుంచి షాద్‌నగర్ దాకా అన్ని పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తయితే సాగునీరు పారుతుందని చెప్పారు.అలాంటి ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నిజంగా పాలమూరు బిడ్డవైతే సమాధానం చెప్పాలని సీఎంకు సవాలు చేశారు. మేడిగడ్డకు వెళ్లినవిధంగానే రెండ్రోజులపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీఆర్ఎస్ నాయకత్వమంతా కలిసి కేసీఆర్ కట్టించిన రిజర్వాయర్లు, పంపుహౌజ్‌లను ప్రజలకు చూపిస్తామని వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా ముఖ్యమంత్రి కొడంగల్ ప్రాజెక్టుకు పైసలు ఖర్చు చేస్తూ, పాలమూరు ఎత్తిపోతల పనులను ఎలా ఎండబెడుతున్నారో తెలియజేస్తామని చెప్పారు.
పేదల గూడును చెదరగొడ్తవా?
పాలమూరు బిడ్డనని చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి అదే జిల్లా ఆదర్శనగర్‌లో 75 మంది దళితులు, పేదల ఇండ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేయించారని కేటీఆర్ విమర్శించారు. 2007లో వైఎస్సార్ ఇచ్చిన ఇండ్లను కూలగొట్టడానికే నేడు సీఎం అయ్యావా? అని ప్రశ్నించారు. పేదల ఇండ్లను కూల్చిన సంఘటనపై బాధితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో పాలమూరులో నాలుగువేల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించగా, ఇంకా రెండుమూడొందల ఇండ్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని కూల్చివేత బాధితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏ కారణంతో పేదల ఇండ్లను కూలగొట్టారో వివరించాలని, ఈ చర్యలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.