సిలిండర్ ధరల పెంపుతో పేద, మధ్య తరగతి ప్రజల బతుకులు మరింత దుర్భరంగా మారే ప్రమాదం ఉన్నది. వాణిజ్య సిలిండర్ ధరల పెంపుతో పేదలు, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, హోటళ్లలో పనిచేస్తున్న శ్రామికులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నది. టిఫిన్ సెంటర్లు, మెస్‌ల నిర్వాహకులు నష్టపోయే ప్రమాదం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలి.
– కేటీఆర్
హైదరాబాద్/రంగారెడ్డి, మే 2 (నమస్తే తెలంగాణ): వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా వెయ్యి రూపాయలు పెంచి సామాన్యులపై మోదీ సర్కార్ పెనుభారం మోపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేసి, ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను అభినందించారు.
ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్), పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ, మండల, జిల్లా కమిటీల నిర్మాణంపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిర్ణయాలతో సామాన్యుల బతుకులు దుర్భరంగా మారాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన మరునాడే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంచి పేదల నడ్డివిరించిందని మండిపడ్డారు. 80 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ.993 పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు.
వాణిజ్య సిలిండర్‌పై తాజా పెంపుతో హైదరాబాద్‌లో రూ.2,221గా ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.3,315కు పెరిగిందని మండిపడ్డారు. వాణిజ్య సిలిండర్ ధరతోపాటు ఐదు కేజీల సిలిండర్ల ధరను రూ.261 మేర పెంచడం శోచనీయమని పేర్కొన్నారు. ఇప్పటికే ఇంధన ధరలను పెంచి, దానిపై సెస్సుల పేరిట రూ.65గా ఉన్న లీటర్ పెట్రోల్ ధరను రూ.110-120కి పెంచారని గుర్తుచేశారు. ఇప్పుడు సిలిండర్ల ధరల పెంపుతో పేద, మధ్య తరగతి ప్రజల బతుకులు మరింత దుర్భరంగా మారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దేశంలో గ్యాస్ కష్టాలు పెరుగడంతో ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్లలో వంటకాలను తగ్గించారని గుర్తు చేశారు. ఇప్పుడు సిలిండర్ ధరల పెంపుతో పేదలు, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, హోటళ్లలో పనిచేస్తున్న శ్రామికులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. టిఫిన్ సెంటర్లు, మెస్‌ల నిర్వాహకులు నష్టపోయే ప్రమాదం ఉన్నదని చెప్పారు. హోటళ్లు, మెస్‌ల నుంచి ఆహార పదార్థాలు తెచ్చుకొనే బ్యాచిలర్లు, ఐటీ ఉద్యోగుల మీద కూడా భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకొని ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు.
అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ మోసాల పరంపర కొనసాగిస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. రెండున్నరేండ్ల పాలన అవినీతి, అరాచకాలు, స్కామ్‌లకు కేరాఫ్‌గా మారిందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలో మంత్రులే స్వయంగా మైనింగ్, భూ కుంభకోణాలకు తెరతీశారని ఆరోపించారు. చేసిన ప్రతిపనిలో కమీషన్లు, కాసులకు కక్కుర్తిపడుతూ రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దల అరాచకాలపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. దోపిడీ పార్టీకి బుద్ధిచెప్పేందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నారని హెచ్చరించారు. అవినీతి కాంగ్రెస్ పార్టీకి మరో 20 ఏండ్లు అధికారం కల్లేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పార్టీ సభ్యత్వ నమోదును చురుగ్గా చేపట్టాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ముందుకుసాగాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని, గడువులోగా సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు. బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పార్టీ నాయకులను కోరారు. కష్టపడ్డ వారికే ఫలితం ఉంటుందని, పదవుల కేటాయింపులో ప్రాధాన్యం దక్కుతుందని చెప్పారు.
కేంద్రం చేపట్టనున్న సర్ (స్పెషల్ ఇంటెన్సెవ్ రివిజన్) సర్వేపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకులకు కేటీఆర్ సూచించారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. ‘సర్’ ముసుగులో కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు. విచ్చలవిడిగా ఓట్ల తొలగింపు, దొంగఓట్లు చేర్పించే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు అనుక్షణం అప్రమత్తంగా ఉండి ఆ రెండు జాతీయ పార్టీల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. అర్హులైన యువతీయువకులు ఓటుహక్కు నమోదు చేసుకొనేలా చూడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులపై ఉన్నదని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్మించాలని కోరారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిర్ణయాలతో సామాన్యుల బతుకులు దుర్భరంగా మారాయి. కేంద్రంలోని బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన మరునాడే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంచి పేదల నడ్డివిరించింది. దీంతో ప్రజల బతుకులు మరింత దుర్భరంగా మారుతాయి. కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకొని ప్రజలకు ఉపశమనం కలిగించాలి. -కేటీఆర్
2 కోట్ల ఉద్యోగాలు గురించి అడిగితే, పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగమేనని ప్రధాని మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. పెరిగిన గ్యాస్ ధరలతో ఇప్పుడు ఆ పకోడీలు కూడా వేసుకొనే పరిస్థితి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. సిలిండర్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో రూపాయి విలువ ఒకవైపు పాతాళానికి పడిపోతుంటే, గ్యాస్, పెట్రో ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు.
త్వరలో జరుగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటడానికి శ్రేణులంతా సమాయత్తం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నదని, వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని పెద్దఅంబర్‌పేట, తుర్కయంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్, గండిపేట, శేరిలింగంపల్లి మున్సిపాలిటీలతోపాటు మీర్‌పేట, బడంగ్‌పేట కార్పొరేషన్లను కూడా గ్రేటర్లో విలీనం చేశారని, వీటిలో రంగారెడ్డి జిల్లా నేతలంతా కలిసికట్టుగా పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు వాణీదేవి, శంభీపూర్‌రాజు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, అంజయ్యయాదవ్, మహేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు స్వామిగౌడ్, క్యామ మల్లేశ్, రాష్ట్ర యువ నాయకులు పటోళ్ల కార్తీక్‌రెడ్డి, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.