KTR | హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా చేసిన వ్యాఖ్యల పట్ల 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సు రేఖకు బుధవారం లీగల్ నోటీసు పంపారు. క్షమాపణ చెప్పని పక్షంలో చట్టప్రకా రం పరువు నష్టం దావా వేయడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు. తాను మంత్రిగా ఉన్న కాలంలో ఫోన్ ట్యాపింగ్ చేశానని, నాగచైతన్య-సమంత విడిపోవడానికి ప్రధాన కారణం తానేనని, కొన్ని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారని, గౌరవానికి, ప్రతిష్ఠకు భంగం కలిగించాలన్న లక్ష్యంగానే అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో పేరొన్నారు. కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును సురేఖ వాడుకుంటున్నారని తెలిపారు.
సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడటం దురదృష్టకరం అని వెల్లడించారు. అసలు తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాలపై సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని అన్నారు. ఎలాం టి సాక్ష్యాధారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన సురేఖ ఒక మంత్రి అని, ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉన్నదని చెప్పారు. మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని సోయి కూడా లేకుండా సురేఖ మా ట్లాడటం ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. గతంలో ఇవే అడ్డగోలు మాటలు మాట్లాడిన సురేఖకు ఈ సంవత్సరం ఏప్రిల్‌లో నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన సురేఖకు భారత ఎన్నికల సంఘం గట్టి హెచ్చరిక చేసిందని, అయినా ఇలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావాతోపాటు క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు.
సీఎం నోరును ఫినాయిల్‌తో కడగాలని మహిళా మంత్రులకు కేటీఆర్ సూచించారు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి కూసిన కారు కూతలు, దౌగుల్బాజీ మాటలను గుర్తుచేసుకోవాలని సూచించారు. బుధవారం తెలంగాణభవన్‌లో మీడియా ఇష్టాగోష్ఠిలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ.. కొండా సురేఖ మీద ఎవరూ ఏమీ మాట్లాడలేదని, ఆమె ఏదో ఉహించుకొని మాట్లాడుతున్నారని, ఇందులో తమకేం సంబంధం ఉన్నదని ప్రశ్నించారు. మంత్రి సీతక్క గతంలో అభ్యంతరకరంగా చేసిన వ్యాఖ్యలనూ ఉదహరించారు.