హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలుచేస్తామని అధికారంలోకి వచ్చి విస్మరించిన కాంగ్రెస్ సర్కారుపై తెలంగాణ ప్రజలు తీవ్ర కోపంతో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తమకు వచ్చిన గొప్ప అవకాశంగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. అందుకే ఓటమి భయంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, 14 మంది మం త్రులు కాలికి బలపం కట్టుకొని గల్లీగల్లీ తిరుగుతున్నారని విమర్శించారు. ఒక ఉప ఎన్నిక కోసం కుల సంఘాలతో మీటింగ్‌లు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. హైదరాబాద్‌లో గురువారం ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ పలు విషయాలను వెల్లడించారు. కేసీఆర్‌ను మిస్ అవుతున్నామన్న భావన ప్రజల్లో కనిపిస్తున్నదని, రెండేండ్ల అనంతరం వచ్చిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలని చూస్తున్నారని తెలిపారు. మూడోసారి 2023 ఎన్నికల్లో గెలిచిన మాగంటి గోపీనాథ్‌కు 16 వేల మెజార్టీ వచ్చిందని, నవంబర్ 14న ఆ మెజార్టీ దాటిపోతుందని ధీమా వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నది ఒరిజినల్ కాంగ్రెస్ కాదని, కల్తీ కాంగ్రెస్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి మొత్తం ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని, అప్పుడే కాంగ్రెస్ పార్టీకి మరో పదిహేనేండ్ల వరకు ఎవరూ ఓటు వెయ్యరని చెప్పారు. ఓట్ల కోసం కోటి ఫీట్లు అన్నట్టు.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీని మరిపించడానికి ఎన్టీఆర్ విగ్రహాల డ్రామా మొదలుపెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు కుక్కమూతి పిందెలు అని ఎన్టీఆర్ విమర్శించారని, అలాంటి వ్యక్తులు ఎన్టీఆర్ విగ్రహం పెడితే.. ఆయన ఆత్మ క్షోభిస్తుందని అన్నారు.
తమ పార్టీ అధినేత కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని కేటీఆర్ వెల్లడించారు. ఉప ఎన్నికలో ప్రచారానికి రావడం లేదా రాకపోవడం విషయంలో ఆయన నిర్ణయమే ఫైనల్ అని తేల్చిచెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి స్థాయి మర్చి గల్లీ లీడర్లా ప్రతీ గల్లీలో మీటింగ్ పెడు తున్నారని.. అయినా ఆయన ఓడిపోవడం పక్కా అని అన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను మరోసారి సీఎంగా చూడాలనుకుంటున్నారని.. పార్టీ కార్యకర్తగా, కేసీఆర్ అభిమానిగా తన కోరిక కూడా అదేనని మనసులో మాటను బయటపెట్టారు. కేసీఆర్‌ను ప్రజలు మిస్సవుతున్నారని, ఆయన పట్లగల సానుకూలతను వ్యక్తీకరించే అవకాశం రాలేదని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి ప్రజానాయకుడు కాదు.. పేవ్మెంట్ కోటాలో పైసలు ముట్టజెప్పి సీల్డ్ కవర్లో సీఎం పదవిని తెచ్చుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్, ఆయన ఫ్యామిలీని బూతులు తిట్టడం, కేసులు పెట్టడం తప్ప రేవంత్‌రెడ్డి సాధించిందేమీలేదని దెప్పిపొడిచారు. నిజంగా ముఖ్యమంత్రికి దమ్ముంటే, కార్యదక్షత ఉంటే చేసిన పనులు చెప్పుకొని ఓట్లడగాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి బానిసలకు బానిస అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఢిల్లీ సర్కారు గులాంగిరి చేస్తున్నది కాబట్టే నిధులు వస్తున్నాయని చెప్పారు. రేవంత్‌రెడ్డి రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ఆయన చేసిన ఒక్క మంచిపని కూడా లేదని అన్నారు.
పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపుతున్న హైడ్రా పెద్దోళ్ల ఇండ్లను ముట్టుకోవడంలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎఫ్టీఎల్లో ఉన్న మంత్రులు పొంగులేటి, వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఇండ్లు, కొడంగల్‌లో రెడ్డికుంటలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇండ్లు హైడ్రాకు కనబడ్తలేవా? అని ప్రశ్నించారు. హైడ్రా సీఎం సోదరుడి రాజప్రసాదాన్ని వదిలి అమీన్‌పూర్‌లోని మధుసూదన్‌రెడ్డి ఇంటిని కూల్చివేసిందని ఆరోపించారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మంత్రులు ఇండ్లను కూలగొట్టి ఆదర్శంగా నిలువాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేసిన ఇండ్లను సైతం నేలమట్టం చేయడం దుర్మార్గమన్నారు. ‘అసలు రేవంత్‌రెడ్డి సర్కారు నడుపుతున్నడా..లేక సర్కస్ నడుపుతున్నడా?’ అంటూ చురకలంటించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు విభిన్నంగా జరిగాయని, ప్రజలు విలక్షణమైన తీర్పు నిచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. ‘ఓఆర్ఆర్ లోపల అన్ని సీట్లలో బీఆర్ఎస్ను గెలిపించారు.. ఉత్తర తెలంగాణలో ఏకైక అతిపెద్ద పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది.. కానీ దక్షిణ తెలంగాణకు వచ్చే వరకు బీఆర్ఎస్కు చేదు ఫలితాలు వచ్చాయి. ఏకపక్షంగా గెలిచిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది’ అని వివరించారు. అప్పటి ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే తెలంగాణలో మూడింట రెండు ప్రాంతాల్లో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఆవిర్భవించిందని చెప్పారు.
రెండేండ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను చూసిన తర్వాత హైదరాబాద్ ప్రజలు ఆ పార్టీని ఏవగించుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నిక రూపంలో ప్రజలకు మరో అవకాశం వచ్చిందని ఉద్ఘాటించారు. తప్పకుండా ఈ ఉప ఎన్నికలో 16 వేల పైచిలుకు మెజార్టీతో
గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో కుటుంబసభ్యుల మధ్య విబేధాలు రావడం, పరస్పర విమర్శలు కొత్తకాదని కేటీఆర్ చెప్పారు. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న తన మామ జైపాల్‌రెడ్డిపై విమర్శలు చేయలేదా? అని ప్రశ్నించారు. కవిత ఆరోపణలను కొందరు ఉద్దేశపూర్వకంగానే బూతద్దంలో చూపుతున్నారని విమర్శించారు. దివంగత గోపీనాథ్‌ను తన సహచరుడంటూనే ఆయనపై సీఎం ఇష్టారీతిన విమర్శలు గుప్పించడం దుర్మార్గమని మండిపడ్డారు. గోపీనాథ్‌ను, ఆయన భార్యను, ఆమె కన్నీళ్లను అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. మంత్రులు పొన్నం, తుమ్మలకు కనీస ఇంగితం ఉన్నదా? ఒక్క సీటు కోసం ఇంత దుర్మార్గమా? వాళ్ల పిల్లలపై కేసులు పెట్టడం కరెక్టా? అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవంలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ముసుగులో బీజేపీతో కలిసి జాయింట్ వెంచర్ సర్కారును నడుపుతున్నారని ఆరోపించారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ రథ చోదకులని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్‌గాంధీ మోదీని ద్వేషిస్తుంటే.. రేవంత్ మాత్రం మోదీని పొగడటం ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ‘అదానీని కలుస్తారు.. హోటల్లో కాళ్లు పట్టుకుంటరు.. చీకట్లో అమిత్‌షాను కలుస్తరు. రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డికి రూ.1150 కోట్ల అమృత్ కాంట్రాక్ట్, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1350 కోట్ల కాంట్రాక్ట్. వీటిని చూస్తుంటే ఎవరు ఎవరితో అంటకాగుతున్నరు? దేశంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటైన పరిస్థితి తెలంగాణలో తప్ప ఎక్కడైనా చూస్తున్నారా?’ అని ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లును కేంద్రం ఆమోదించగానే మొట్టమొదలు అమలు చేసింది చోటాభాయ్ కాదా? ప్రజలకు చెప్పాలని.. బీజేపీ రాష్ట్రాలకు లేని తొందర రేవంత్‌రెడ్డికి ఎందుకని నిలదీశారు.
ఓటమి భయంతోనే రేవంత్‌రెడ్డి ఒక ఉప ఎన్నిక కోసం కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కుల సంఘాలతోనూ సమావేశాలు నిర్వహించడాన్ని బట్టి ఆయన కండ్లల్లో ఓటమి భయం స్పష్టంగా కనబడుతున్నదని అపహాస్యం చేశారు. కేసీఆర్ 12 సార్లు ఉప ఎన్నికలు ఎదుర్కొన్నారని, కానీ ఏనాడు కుల సంఘాలతో సమావేశం పెట్టలేదని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ తమ సిట్టింగ్ సీటు కాబట్టే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, కానీ ముఖ్యమంత్రికి ఆ ఖర్మ ఎందుకు వచ్చిందో ఆలోచించాలని అన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండంగా భావిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా రేవంత్‌రెడ్డి తప్పించుకుంటున్నారని, కాంగ్రెస్‌కు ఇది అలవాటే అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో షాడో క్యాబినెట్ కొనసాగుతున్నదని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అనధికార హోంమంత్రిగా ఫహీం ఖురేషీ, మున్సిపల్ మంత్రిగా ఏవీ రెడ్డి, సినిమా మంత్రిగా రోహిన్‌రెడ్డి చలామణి అవుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్వైజర్లను పెట్టుకోవద్దని రేవంత్‌రెడ్డి కోర్టుకు వెళ్లారని, ఇప్పుడు ఆయనే సలహాదారులను పెట్టుకుంటున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బీజేపీ సహాయ పార్టీగా పనిచేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్లు జరిగితే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పదు, కేంద్రంలోని బీజేపీ సర్కారు వివరాలు వెల్లడించదు.. దీని వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కలిసి ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడానికి మూకుమ్మడిగా వస్తున్నాయని విమర్శించారు. పీజేఆర్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేసి ఆయన చనిపోవడానికి కారణమైందని కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. 2023లో పీజేఆర్ కొడుకుకు కాంగ్రెస్ ఎందుకు టికెట్ ఇవ్వలేదని నిలదీశారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదని, రేవంత్‌రెడ్డికి సహాయ మంత్రిగా కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు.