మంచిని మైక్‌లో చెప్పాలి.. చెడును చెవిలో చెప్పాలని కాంగ్రెస్ విస్త్రృతస్థాయి సమావేశంలో సెలవిచ్చిన రేవంత్‌రెడ్డి.. ఒక మంచి పని కూడా చేయలేదు కాబట్టే ఎవరూ మైక్‌లో చెప్పడం లేదు. రేవంత్ పాలనలో చేసిన చెడు మాత్రం చాలా ఉన్నది. చెప్పడం మొదలుపెడితే రేవంత్ చెవుల నుంచి రక్తం కారుతది.
– కేటీఆర్
KTR | హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రాష్ర్టానికి కేసీఆర్ సంపూర్ణం న్యాయం చేస్తే ఇవాళ రేవంత్‌రెడ్డి పాలనలో నీళ్లు పాతాళానికి పోయాయని, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవాచేశారు. మంచిని మైక్‌లో చెప్పాలి.. చెడును చెవిలో చెప్పాలని సెలవచ్చిన రేవంత్‌రెడ్డి ఒక మంచి పని కూడా చేయలేదు కాబట్టే ఎవరూ మైక్‌లో చెప్పడం లేదని దెప్పిపొడిచారు. రేవంత్ పాలనలో చేసిన చెడుమాత్రం చాలా ఉన్నదని మండిపడ్డారు.
హైడ్రాతో పేదల ఇండ్ల విధ్వంసం, ఆర్ఆర్ టాక్స్, భూకబ్జాలు, అంతులేని అవినీతితో కుప్పకూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్, కొట్టుకుపోయిన పెద్దవాగు, మునిగిన వట్టెం పంప్‌హౌస్ ఇలా చెప్పడం మొదలుపెడితే రేవంత్ చెవుల నుంచి రక్తం కారుతుందని విమర్శించారు. చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండల మాజీ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డితోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 500 మంది నాయకులు, కార్యకర్తలు శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘జనవరి 26న ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు టకీటకీమని పడతాయని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిండ్రు. రూపాయి కూడా పడలేదు. రుణమాఫీ కాలేదు, పెన్షన్లు పెరగలేదు.. రైతు భరోసా లేదు.. ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి కింద తులం బంగారం లేదు.. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోడంతో రేవంత్‌రెడ్డిని మహిళలు పొట్టుపొట్టు తిడుతున్నరు. కేసీఆర్ హయాంలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో విధ్వంసం, అరాచకాలతో కుప్పకూలింది. హైడ్రా, మూసీ కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతీన్నది. మేడ్చల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం’ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ర్టాన్ని అన్నింట్లో ఆగం పట్టించిన రేవంత్‌రెడ్డి.. కొత్తగా తెలంగాణ రైజింగ్ నినాదాన్ని ఎత్తుకున్నడు. ఏడాదిలో రూ.1,50,000 కోట్ల అప్పు తెచ్చి, ఒక పథకాన్ని ప్రారంభించలేదు. ఒక్క ప్రాజెక్టుకు ఇటుక పేర్చలేదు. ఎక్కడ రైజింగ్? 450 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నరు. క్రైమ్‌రేట్, అప్పులు, ఆత్మహత్యల్లోనే తెలంగాణ రైజింగ్ కనిపిస్తున్నది.
– కేటీఆర్
‘అధికారం ఎవరికీ శ్వాశతం కాదు. అందర్నీ ఏకం చేసి ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి చేసి చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణను సాధించిండ్రు. సంతోషం వచ్చినా.. దుఃఖం వచ్చినా ఇవాళ కేసీఆర్‌ను ప్రజలు యాది చేసుకుంటున్నరు. కుటుంబానికి బాపు లెక్క.. తెలంగాణ బాపు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండె అని వృద్ధులు, పేదింటి ఆడబిడ్డలు చెప్తున్నరు. ఎకడ ముసలవ్వను అడిగినా.. పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షనే వస్తున్నదని అంటున్నరు. కేసీఆర్ ఉన్నప్పుడు కల్యాణ లక్ష్మి వచ్చిందని, కేసీఆర్ కిట్ వచ్చిందని చెప్తున్నరు. అప్పుడా పథకాలు లేనేలేవని ఆడబిడ్డలు బాధపడుతున్నరు. రైతుబంధు పడ్తలేదు.. రేవంత్ పచ్చి జూటాగాడని అన్నదాతలు తిడుతున్నరు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లు వేసే టైంకు రైతుబంధు పడుతుండెనని గుర్తు చేసుకుంటున్నరు. రైతులను, ఉద్యోగులను, నిరుద్యోగులను వృద్ధులను, మహిళలనే కాదు.. రేవంత్‌రెడ్డి అందరి కొంప ముంచిండు’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే తెలంగాణ ఉద్యమ నినాదం సాకారమైందని కేటీఆర్ గుర్తుచేశారు. ‘కేసీఆర్ నాయకత్వంలో ఇంటింటికీ మంచినీళ్లు తెచ్చుకున్నం. సాగునీరివ్వడంతో సాగు పెరిగింది. వరి పంటలో నంబర్ వన్‌గా నిలిచినం. నిధుల విషయంలో తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్‌గా రాష్ర్టాన్ని నిలిపినం. రైతుబంధు, రుణమాఫీ ద్వారా లక్ష కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినం. సంపద సృష్టించి పేదలకు పంచినం. రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2000కు పెంచినం.
ఎన్నో కొత్త ప్రాజెక్టులు కట్టినం. నియామకాల విషయానికొస్తే ప్రభుత్వ రంగంలో 2.32 లక్షల ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో 24 లక్షల ఉద్యోగాలను కేసీఆర్ సృష్టించిండ్రు. ఈ మూడింటిలో కేసీఆర్ సంపూర్ణంగా న్యాయం చేసిండ్రు. కానీ, ఇవాళ రేవంత్‌రెడ్డి పాలనలో నీళ్లు పాతాళానికి పోయినయి.. కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం నీళ్లు ఇవ్వకపోవడడం వల్ల పంటలు ఎండిపోతున్నయి. నీళ్లు పాతాళానికి పోతే.. నిధులేమో ఢిల్లీకి పోతున్నయి. జాబ్ క్యాలెండర్, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలన్నరు.. కానీ పత్తాలేవు. రాహుల్‌గాంధీ అశోక్‌నగర్ వెళ్లి ఏడాదికి 2 లక్షల ఉద్యోలిస్తామని చెప్పిండు. ఆరు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు’ అని కేటీఆర్ దుమ్మెత్తిపోశారు.
కేసీఆర్ పాలనలో ఎండాకాలంలోనూ చెరువులు అలుగులు దుంకితే రేవంత్‌రెడ్డి పాలనలో కాళేశ్వరం నీళ్లు ఇవ్వక పంటలు ఎండిపోతున్నయి. నీళ్లు పాతాళానికి పోతుంటే.. నిధులు ఢిల్లీకి పోతున్నయి. నియామకాలు గాలికి పోయినయి.
– కేటీఆర్
అధికారం చేపట్టి 15 నెలలవుతున్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన పదిశాతం పనులను ఎందుకు పూర్తిచేయడం లేదని కేటీఆర్ నిలదీశారు. ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా చేవెళ్ల, శంకర్పల్లి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చేందుకు కేసీఆర్ కృషిచేస్తే.. ఇదే కాంగ్రెస్ నేతలు కేసులు వేసి ఆపిండ్రు. అయినా 90 శాతం పనులు పూర్తయినయి. కేవలం 10శాతం పనులు చేస్తే చేవెళ్లకు నీళ్లు వస్తయి. కేవలం కాల్వలు తవ్వితే నీళ్లు వస్తయి.
కానీ, రేవంత్‌రెడ్డి అలా చేయడం లేదు. కేసీఆర్‌కు పేరు వస్తుందన్న అసూయతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నడు. అది చేయకుండా.. మూసీని సుందరీకరణ చేస్తాడంట. వికారాబాద్ అడవుల్లో మొదలయ్యే మూసీని కిందకు తీసుకుపోయి నందనవనం చేస్తా అంటున్నడు. మూసీతో సాగయ్యేది ఎన్ని ఎకరాలు? సృష్టించే సంపద ఎంత ? దాని వల్ల ఈ నగరానికి, రాష్ర్టానికి లాభమెంత అంటే చెప్పడు. పాలమూరు ఎత్తిపోతలను పూర్తిచేస్తే రేవంత్‌కు కమీషన్లు దొరకవు. కాబట్టి మూసీ పేరిట రంగుల కల చూపించి లక్షన్నర కోట్లు ఖర్చు పెడుతా అని చెప్పి 70 వేల కోట్లు దండుకోవాలనేది రేవంత్‌రెడ్డి ప్లాన్. ఆ 70 వేల కోట్లను ఢిల్లీ పెద్దలకు పంపి కుర్చీ కాపాడుకోవాలనే తాపత్రయంతో రేవంత్‌రెడ్డి పని చేస్తున్నరు’ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు సుతిలేని సంసారం తరహాలో ఉన్నదని కేటీఆర్ మండిపడ్డారు. మంత్రుల మధ్య కనీసం సమన్వయం లేదని విమర్శించారు. ఎస్ఎల్బీసీ టన్నెల ప్రమాదంలో కార్మికులు చనిపోయారని ఓ మంత్రి చెప్తే, మరో మంత్రి చనిపోలేదని అంటున్నారని తెలిపారు. మట్టి దిబ్బల కింద ఎనిమిది మంది చిక్కుకుపోతే, చేపల కూర కావాల్సి వచ్చిందా? అని నిలదీశారు. టన్నెల్ ప్రమాదానికి వాటర్‌లో నీళ్లు కలవడమే కారణమని సోయిలేకుండా మాట్లాడుతున్నరని ఎద్దేవాచేశారు.
రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలుండి కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి గుండుసున్నా తెచ్చారని మండిపడ్డారు. కనీసం ఒక నవోదయ స్కూల్, కనీసం ఒక కాలేజీ కూడా కేంద్రం నుంచి తేలేకపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలే. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్సే. తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆరే. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా, పంచాయతీ ఎన్నికల్లో అయినా గులాబీ జెండా ఎగరాల్సిందే. రాబోయే పంచాయతీ, ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది.
కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ మళ్లీ అగ్రస్థానంలో నిలుస్తుంది. గులాబీ జెండా ఎగిరితేనే తెలంగాణ గెలుస్తుంది.. నిలుస్తుంది? అని కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, నాయకులు పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, ఆంజనేయగౌడ్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
బ్యాగులు మోసి సీఎం అయిన రేవంత్‌ను పకన పెట్టుకొని తన బ్యాగులు మోయొద్దని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడటం విడ్డూరంగా ఉన్నది.. ఇది పెద్ద జోక్.. అప్పట్లో చంద్రబాబుకు బ్యాగులు మోస్తే, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానానికి రేవంత్‌రెడ్డి బ్యాగులు మోస్తున్నడు.
– కేటీఆర్
రాష్ర్టాన్ని అన్నింట్లో ఆగం పట్టించిన సీఎం రేవంత్‌రెడ్డి.. కొత్తగా తెలంగాణ రైజింగ్ అనే నినాదాన్ని ఎత్తుకున్నారని కేటీఆర్ విమర్శించారు. ఏడాదిలోనే రూ.1,50,000 కోట్ల అప్పు తెచ్చి, ఒక కొత్త పథకాన్ని కూడా ప్రారంభించలేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా ఇటుక పేర్చలేదు. ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు. ఒక్క కొత్త రేషన్‌కార్డు ఇవ్వలేదు. ఎక్కడ రైజింగ్? 450 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నరు. క్రైమ్‌రేట్‌ను భారీగా పెంచిండ్రు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిండ్రు. క్రైమ్‌రేట్, అప్పులు, ఆత్మహత్యల్లోనే తెలంగాణ రైజింగ్ కనిపిస్తున్నది’ అని కేటీఆర్ విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పతనానికి కౌంట్‌డౌన్ మొదలైందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మార్పే ఇందుకు నిదర్శమన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలన సబ్బండ వర్ణాలకు స్వర్ణయుగమైతే.. రేవంత్‌రెడ్డి పాలన చీకటి యుగమని అభివర్ణించారు. ఉమ్మడి రాష్ట్రంలో కరువు తాండవించిందని, తెలంగాణలో అనేక జిల్లాలను కేంద్రం కరువు ప్రాంతాలుగా ప్రకటించిందని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో చెరువులు వేసవిలో కూడా అలుగులు దుంకాయని పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడం ప్రజల హృదయ స్పందనకు నిదర్శమని చెప్పారు. ఇటీవల శివరాత్రి సందర్భంగా శివాలయాలను సందర్శిస్తే ప్రజలంతా కేసీఆర్ మళ్లీ రావాలని కోరారని తెలిపారు.