KTR | ఇందిరమ్మ రాజ్యంలో భూబకాసురలదే రాజ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని భూదోపిడీ జరుగుతోందని ఆరోపించారు. భూములను కాపాడాల్సిన కాపలాదారులే కబ్జాదారులుగా మారారని మండిపడ్డారు. కోటి ఎకరాల ప్రజా సంపదను కొల్లగొట్టే కుతంత్రం జరుగుతోందని ఆరోపించారు.
తెలంగాణ భవన్లో సెక్షన్ 22ఏ భూ బాధితులతో కేటీఆర్, హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడకముందు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, భూముల విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు ఉండేవని గుర్తుచేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే కరెంటు, తాగునీటి సమస్యలను పరిష్కరించారని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా ఒకే రోజులో జీవోలు ఇచ్చారని తెలిపారు.
కేసీఆర్ పాలనలో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, బాసర నుంచి భద్రాచలం వరకు పుష్కలంగా సాగునీరు అందిందని కేటీఆర్ అన్నారు. అప్పట్లో ఎకరం రూ.5 లక్షలుగా ఉన్న భూమి విలువ రూ.50 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. భూమి సురక్షితమైన పెట్టుబడి అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని, అలాంటి పరిస్థితిని ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా మార్చేస్తోందని విమర్శించారు.
‘భూమి కనబడితే బుక్క పెట్టు.. జాగా కనబడితే పాగా వేయ్’ అన్నట్లుగా పరిస్థితి తయారైందని కేటీఆర్ ఆరోపించారు. ‘గాంధీల సామంతుల పాలనలో గజానికో గజదొంగ.. గుంటకో గుంటనక్క’ అన్నట్లుగా వ్యవహారం సాగుతోందని వ్యాఖ్యానించారు. ‘ఇందిరమ్మ రాజ్యంలో భూబకాసురలదే రాజ్యం’ అని మండిపడ్డారు.
కోటి 16 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని కేటీఆర్ ఆరోపించారు. బకాసుర బ్రదర్స్‌కు భూములపై కన్ను పడిందని వ్యాఖ్యానించారు. ‘మంత్రులు కాదు.. అలీబాబా 40 దొంగలు’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. మంచిరేవుల భూకుంభకోణం బయటపడిన తర్వాత ఒక మంత్రి బర్తరఫ్ అయ్యారని తెలిపారు. మంత్రులు, ముఖ్యమంత్రి మధ్య పర్సంటేజీల యుద్ధం జరుగుతోందని ఆరోపించారు. ఇది ‘30 పర్సెంట్ కమీషన్ల సర్కార్’ అని విమర్శించారు.
హరీశ్‌రావు నాదర్గుల్ భూముల వ్యవహారాన్ని బయటపెట్టారని కేటీఆర్ తెలిపారు. 22ఏ వ్యవహారం మహా కుంభకోణమని అన్నారు. సిరిసిల్ల జిల్లా సముద్రలింగాపూర్లో రైతులకు చెందిన 800 ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టారని ఆరోపించారు. ఎస్ఐఆర్లోనూ చాలామంది ఓట్లు కోల్పోయారని అన్నారు.
రాష్ట్రంలో ఒక సమాంతర రెవెన్యూ వ్యవస్థ నడుస్తోందని కేటీఆర్ ఆరోపించారు. బయటకు కనిపించేది ఒక వ్యవస్థ అయితే.. చీకట్లో మరో వ్యవస్థ పనిచేస్తోందని అన్నారు. ఫైళ్లు ఎవరి ఆదేశాలతో కదులుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఉందని విమర్శించారు. దళితులు, గిరిజనులకు చెందిన అసైన్డ్ భూములు మాయమవుతున్నాయని ఆరోపించారు.
లగచర్లలో రేవంత్‌రెడ్డి తన అల్లుడి కోసం గిరిజన భూములు గుంజుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల భూములపై కన్ను పడిందని అన్నారు. గుడి, బడి, ఆస్పత్రి, స్మశానవాటిక కోసం ప్రభుత్వం దగ్గర ఎకరం భూమి కూడా లేదని చెబుతూ.. అస్మదీయుల కోసం మాత్రం హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని విమర్శించారు.
పది వేల ఎకరాలను కాజేసే కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. భూములను అడ్డికి పావుశేరు లెక్కన విక్రయిస్తున్నారని, మూసీ పేరుతో వేల ఎకరాలను మింగే కుట్ర జరుగుతోందని అన్నారు. ఫార్మాసిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో భూదందాలకు తెరలేపారని ఆరోపించారు. రూ.200 కోట్ల విలువైన భూమిని రూ.7 కోట్లకే ఇచ్చారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ హయాంలో కొంగరకలాన్‌కు ఫాక్స్‌కాన్ సంస్థ వచ్చిందని, దీంతో అక్కడి భూములకు భారీ డిమాండ్ ఏర్పడిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ భూములపై రేవంత్‌రెడ్డి కన్ను పడిందని ఆరోపించారు. రూ.వంద ఎకరాల్లోనే రూ.వెయ్యి కోట్ల మాయాజాలానికి సిద్ధపడ్డారని అన్నారు. భూములు విక్రయించేందుకు నిరాకరించిన యజమానుల భూములను నిషేధిత జాబితాలో పెట్టారని ఆరోపించారు.
నేరపూరిత మనస్తత్వంతో ఒక ముఠాను ఏర్పాటు చేశారని, ఆ ముఠా ఆదేశాలతోనే 22ఏ కుంభకోణం నడుస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ధరణి వ్యవస్థలో వేలిముద్ర లేకుండా ఇంచు భూమి కూడా కదిలేది కాదని, కానీ భూభారతి పేరుతో భూముల తారుమారు జరుగుతోందని విమర్శించారు. భూములను కాపాడాల్సిన కాపలాదారులే కబ్జాదారులుగా మారారని అన్నారు.
ఈ భూవ్యవహారాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. మరో రెండేళ్లలో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. నిషేధిత జాబితాలో ప్రజల భూములను పెట్టిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిషేధించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.