హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్‌రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, అన్ని రంగాలపై కాంగ్రెస్ అసమర్థ విధానాల ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు. ఈ ఉప ఎన్నికలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి, జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ విజయయాత్రను తిరిగి ప్రారంభించాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. 22 నెలలుగా కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ అసమర్థ విధానాలతో నష్టపోయాయని, వారంతా కాంగ్రెస్ పాలనపై తీవ్ర కోపంగా ఉన్నారని తెలిపారు. వారంతా బీఆర్ఎస్నే ప్రత్యమ్నాయంగా భావిస్తున్నారని చెప్పారు.
‘హైదరాబాద్‌లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలను మూడు రోజులైనా గుర్తించలేదు. ఇంతకన్నా అసమర్థతత, చేతకానితనం, పరిపాలనా వైఫల్యం ఇంకోటి ఉంటదా? కనీసం తమ ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన, గుండెకోత, మానవత్వం లేని కాంగ్రెస్‌కు కనిపించడం లేదా?’ అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆరుగురిని సజీవ సమాధి చేసి ఇప్పటికే మహాపాపం మూటగట్టుకున్నారని, నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలను కూడా గుర్తించకపోతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు.
హైదరాబాద్‌ను తెలంగాణ ఆర్థిక ఇంజిన్‌గా మార్చిన పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు భిన్నంగా, కాంగ్రెస్ సర్కారు విధానాలు నగరాన్ని పూర్తిగా కుప్పకూల్చేలా ఉన్నయి. ఈ విషయాన్ని నగర ప్రజలు గమనిస్తున్నరు. హైదరాబాద్ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని ప్రజలు భావిస్తున్నరు.
-కేటీఆర్
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బీఆర్ఎస్ స్వాగతించడాన్ని విమర్శిస్తున్న బీజేపీ నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు మీద ఏమాత్రం గౌరవం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీది నకిలీ జాతీయవాదమని, తమది ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టంచేశారు. కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడినీ సమానంగా ఆదరించడమే తమ దృష్టిలో నిజమైన జాతీయవాదమని చెప్పారు. జాతీయవాదానికి, దురహంకార దేశభక్తికి (జింగోయిజం) మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడమే అసలైన దేశభక్తి అని స్పష్టంచేశారు.
పహల్గాం దారుణ మారణకాండకు కారణమైన పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడించిన బీజేపీకి బీఆర్ఎస్ దేశభక్తి గురించి ప్రశ్నించే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో చిందిన 26 మంది అమాయకుల నెత్తురు తడి ఇంకా ఆరకముందే ఆ దేశంతో క్రికెట్ ఆడేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ పార్టీ నకిలీ జాతీయవాదం, కపట దేశభక్తికి తిరుగులేని సాక్ష్యమని మండిపడ్డారు. పహల్గాం బాధిత కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించినా ఏ మాత్రం పట్టించుకోకుండా కోట్లాది భారతీయులను మోదీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని నిప్పులు చెరిగారు.