KTR | కేసీఆర్ మీటింగ్ రోజే సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్‌చాట్ నిర్వహించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డిది చిట్ చాట్ కాదు.. చీట్ చాట్ అని విమర్శించారు. రేవంత్ రెడ్డిది ఐడెంటిటీ క్రైసిస్ అని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తన పేరు ప్రస్తావిస్తాడని రేవంత్ రెడ్డి ఎదురుచూస్తున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డిని ఎవరూ గుర్తించడం లేదని.. యాంకర్లు గుర్తుపట్టడం లేదని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు కూడా నిన్ను గుర్తించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం అని పెట్టుకోండి.. ఎవరొద్దన్నారు అని మండిపడ్డారు. కేసీఆర్ గురించి చాలామంది చాలా మాట్లాడుతారని తెలిపారు. అన్నింటి గురించి స్పందించే టైమ్ లేదు.. మాకు చాలా పనుంది పేర్కొన్నారు.
చీఫ్ మినిస్టర్.. చీప్ మాటలు మాట్లాడితే బాగుండదని హితవు పలికారు. విషయం మాట్లాడే తెలివి.. ఈ ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు. ఎంతసేపూ బూతులు, విషయం చిమ్మడం మాత్రమే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చతికిలపడి 12 ఏండ్లు అవుతుందని అన్నారు. ముందు మీ పార్టీ సంగతి చూసుకోండి.. మా గురించి ఎందుకు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీని ఎలా గడగడలాడించిందో కాంగ్రెస్ పెద్దలకు తెలుసని అన్నారు. మా పార్టీకి ఇవాళ శుభదినం.. అలాంటి వారి గురించి మాట్లాడటం ఇష్టం లేదని అన్నారు. దేవుడి మీద ఒట్లు పెట్టి మాట తప్పిన మనిషి గురించి ఏం మాట్లాడతామని ప్రశ్నించారు. ఆయనో మనిషి? ఆయన నోటికి, మాటకు విలువ ఉన్నదా అని మండిపడ్డారు.