KTR | హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘ఫార్ములా ఈ-రేస్‌పై లీకువీరుడికి అసెంబ్లీలో చర్చపెట్టే దమ్ములేదు’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి నిజాలు చెప్పే ధైర్యంలేదని ధ్వజమెత్తారు. రాజకీయ దుష్ప్రచారంలో భాగంగానే మీడియాకు లీకులు ఇస్తూ ముఖ్యమంత్రిగా కాకుండా లీకువీరుడిగా మారాడని విమర్శించారు.ఫార్ములా ఈ-రేస్‌లో అవినీతిపై ఆధారాలుంటే సభలో పెట్టాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో చర్చ పెడితే ఎవరు ఏంటో ప్రజలే నిర్ణయించుకుంటారని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి అధికారికంగా చెప్పే దమ్ములేక క్యాబినెట్లో నాలుగు గంటల చర్చ అంటూ వార్తలు రాయించారని ఆరోపించారు. మంత్రివర్గంలో కొందరు గుసగుసలు పెట్టుకుంటూ ‘గాసిప్బ్యాచ్’ మాదిరిగా తయారైందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డికి నేరుగా ఎదుర్కొనే దమ్ములేక ఉన్నతాధికారులతో, పోలీసులతో లీకులు ఇప్పిస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఆరోపణలు తప్ప వాటిలో పసలేదని అన్నారు.
బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్థానిక సంస్థల చట్టాల సవరణలను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. చట్టాల సవరణ ద్వారా బీసీలకు పూర్తి అన్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో, మరోపేరుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన హామీ గంగలో కలిసినట్టేనని వివరించారు. ఈ చట్టం అమలైతే బీసీలకు రిజర్వేన్లు దకవని చెప్పారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని న్యాయస్థానాల తీర్పుల్లో స్పష్టంగా ఉందని తెలిసినా కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో రిజర్వేషన్లు కల్పిస్తామని కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడిందని విమర్శించారు.
బీసీ రిజర్వేష్లపై 2010, 2021లో మహారాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టులు స్పష్టమైన తీర్పులిచ్చాయని, అయినప్పటికీ కాంగ్రెస్ 2023లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పం పాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రె స్ పార్టీకి నిజాయితీ ఉంటే రాజ్యాంగ సవరణ చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుం చి 8 మంది చొప్పున కాంగ్రెస్, బీజేపీ ఎంపీలతోపాటు, రాజ్యసభలో తాము అందరం కలిసి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పారు.
అకారణంగా కూల్చివేసిన ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని నాగర్‌కర్నూల్ కూల్చివేతలపై కోర్టు తీర్పు ఇచ్చిందని, ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా పేరుతో జరిగిన నిర్మాణాలను పునర్నిర్మించి ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కూల్చివేతలపై నాగర్‌కర్నూల్‌కు ఒకనీతి…జీహెచ్ఎంసీకి ఒకనీతి ఉంటదా? అని ప్రశ్నించారు. చట్టం అమలులోకి రాకముందు కూల్చివేతలు ఎలా చేశారని ఆయన నిలదీశారు. కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రోజుకో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆవాసాలను కూల్చమని ఒకసారి, కమర్షియల్ నిర్మాణాలను కూల్చమని మరోసారి రోజుకోవిధంగా ప్రకటిస్తున్నారని చెప్పారు.
ధైర్యం ఉంటే ఈ-రేసుపై శాసనసభలో చర్చ పెట్టాలని కేటీఆర్ సవాల్ చేశారు. శాసనసభలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ-రేసులో ఏదో కుంభకోణం జరిగిందంటున్నారు. దీనిపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శాసనసభలోనే చర్చ పెట్టండి. దీనిపై సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.’ అని స్పష్టం చేశారు. ఇక రూ. 75 కోట్లకు ఎకరం చొప్పున 400 ఎకరాల భూమిని విక్రయించడంపైనా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూమి ద్వారా మూడు శాతం కమీషన్ ఇచ్చి రుణాలు పొందే దౌర్బాగ్య పరిస్థితి ఏర్పడిందని అన్నారు.