హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : అల్లు అర్జున్ అరెస్టు పాలకుల అభద్రతాభావానికి తారాణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అర్జున్ అరెస్టులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎక్స్ వేదికగా ఖండించారు. ‘తొకిసలాట బాధితుల పట్ల నాకు పూర్తి సానుభూతి ఉన్నది, కానీ, అసలు తప్పు ఎవరిది? సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ను అరెస్టు చేయడం న్యాయమే అయితే, హైడ్రా పేరుతో పేదలను భయభ్రాంతులకు గురిచేసి, వారి మరణానికి కారణమైన రేవంత్‌రెడ్డిపైనా కేసులు పెట్టి అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు. ‘అభద్రతాభావానికి గురైన నాయకుడు ఎప్పుడూ తన చుట్టూ ఉన్న వారిని విధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తాడు’ అని ప్రముఖ అమెరికన్ రచయిత రాన్ కార్పెంటర్ వ్యాఖ్యలను ఉటంకించారు.